Reading Time: < 1 minute

తెలంగాణ టార్గెట్ అంటే ఊరుకోం..మీ ఆటలు ఇక్కడ సాగనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

 తెలంగాణ మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ తర్వాత తెలంగాణే తమ టార్గెట్ అంటూ కొందరు కుట్రలు చేస్తున్నారని, అక్కడ మమతా బెనర్జీ మౌనంగా ఉండొచ్చేమో కానీ.. తెలంగాణలో మాత్రం ఆ ఆటలు సాగవని సీఎం హెచ్చరించారు. అర్హులైన పేదల ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, చిన్న చిన్న తప్పుల వల్ల ఎవరి ఓటూ పోకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సెక్యులర్ పార్టీనేనని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్సనే విషయాన్ని గుర్తుచేశారు. కానీ బీజేపీ మాత్రం రిజర్వేషన్లు ఉండకూడదనే ఉద్దేశంతో మైనారిటీ రిజర్వేషన్లను తొలగిస్తామంటోందని మండిపడ్డారు. దమ్ముంటే గుజరాత్‌లో మైనారిటీ రిజర్వేషన్లు తొలగించి చూపాలన్నారు.

ఇక గత ప్రభుత్వ హయాంలో పోటీ పరీక్షల తీరును ఎద్దేవా చేస్తూ.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏకంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను కూర్చోబెట్టి గ్రూప్-1 ఆఫీసర్లను తయారుచేయాలని చూశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, సుప్రీంకోర్టు వరకు పోరాడి పారదర్శకంగా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేశామని సీఎం తెలిపారు.

ALSO READ : ‘ఇదేం రాజకీయం? ఇదేం ఎజెండా?’..

రాజకీయంగా మైనారిటీ నాయకులకు కాంగ్రెస్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, ఓడిపోయినప్పటికీ అజారుద్దీన్‌ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నామని సీఎం చెప్పారు. ఇక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామన్నారు. యువత కేవలం డిగ్రీలతో సరిపెట్టుకోకుండా నైపుణ్యాలు పెంచుకుంటే విదేశాల్లో నెలకు లక్షల్లో సంపాదించే ఉద్యోగాలు సాధించవచ్చని, అందుకే రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక ఏటీసీలుగా మారుస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.