
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు తిరుపతి ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు విదేశీ భక్తులు తిరుపతికి రావాలంటే ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసుకున్న అనంతరం రోడ్డు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తిరుపతికి చేరుకునేవారు.
తాజా నిర్ణయంతో ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయం, అదనపు ప్రయాస తగ్గే అవకాశం ఉంది.
ప్రయాణానికి ముందే ఈ-వీసా పొందాలి
విదేశీ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం పది రోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో ఈ-వీసా పొందాల్సి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సంబంధిత సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నారు. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేవు. అయినప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ ముందుగానే ఈ-వీసా కౌంటర్‌కు అనుమతి మంజూరు చేసింది. త్వరలో తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఈ నిర్ణయంతో కనిపిస్తున్నాయి.
2007లోనే అంతర్జాతీయ హోదా
తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రక్రియ చాలాకాలం క్రితమే ప్రారంభమైంది. 2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనంతరం 2017లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సేవలను అందుబాటులోకి తీసుకురావడం, భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభానికి మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు తిరుపతికి నేరుగా చేరుకునే అవకాశం లభిస్తే ఆలయ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం పెరగనుంది.