
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు రావాలని పిలిచేది ఆయన ప్రసంగం వినడానికి కాదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ రాజధానిలో మన విద్యార్థులపై పెల్లెట్లు, లాఠీలు, తూటాలతో అమానుష దాడికి బాధ్యులు ఎవరనేది అమిత్‌షా నోటివెంట వినాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు వచ్చి విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం సభలో వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమిత్‌షా సభకు రావాలంటూ తాము చేస్తున్న డిమాండ్ వెనక ‘విద్యార్థులపై దాడులకు ఆదేశించింది ఎవరు?’ అనేది తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉందన్నారు.
అమిత్‌షా లోక్ సభలో చేసే ప్రసంగంపై కానీ, ఊహాజనిత సంభాషణలపై కానీ తమకు ఎలాంటి ఆసక్తి లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ‘అమిత్‌షా ఆదేశించారా లేదా?.. లేక విద్యార్థులపై దాడి జరిగిన విషయమే ఆయనకు తెలియదా? కేంద్ర హోంమంత్రిగా ఆయన ఆదేశించకుంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు?’ అనే ప్రశ్నలకు తాము జవాబులు ఆశిస్తున్నట్లు వివరించారు.
విద్యార్థులపై దాడులకు ఆదేశించింది అమిత్‌షానే అయితే ఆయన దోషి అవుతారని, దాడి విషయం తెలియనే లేదంటే.. అప్పుడు కేంద్ర హోంమంత్రి పదవికి ఆయన అన్ ఫిట్ అని తేల్చిచెప్పారు. ఈ రెండు సందర్భాల్లో ఏది నిజమైనా సరే.. అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.