Reading Time: 2 minutes
Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?

ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోతుంది. ఎలక్ట్రికల్ బైక్స్, స్కూటీలు, కార్లు వంటివి మార్కెట్లోకి తెగ వచ్చేస్తున్నాయి. వివిధ కంపెనీలు ఈవీ వెహికల్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ కొనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇస్తున్న సబ్సిడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2028 ఆర్ధిక సంవత్సరం వరకు దీనిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్రం తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో పాటు అదనపు నిధులను కూడా కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈవీ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రూ.1772 కోట్ల నిధులను కేటాయించగా.. తాజాగా వాటిని పెంచింది. అదనంగా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోగా.. మొత్తం కేటాయింపులు రూ.2767కి చేరుకున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందించేందుకు వాటి సంఖ్యను కూడా పెంచారు. కంగా 45.7 లక్షల వాహనాలకు సబ్సిడీ అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. 2024న పీఎం ఈడ్రైవ్ స్కీమ్ కేంద్రం తీసుకురాగా.. రెండేళ్ల పాటు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ గడువు మార్చి 31, 2026తో ముగిసింది. దీంతో ఇప్పుడు మరో రెండేళ్లు పెంచారు. అంటే 2028, మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. సబ్సిడీని క్లెయిమ్ చేసుకునేందుకు డిసెంబర్ 31, 2027 చివరి తేదీగా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు, త్రీ వీలర్స్‌తో పాటు బస్సులు, ట్రక్కులు, హైబ్రిడ్ అంబులెన్స్‌లకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తారు.

ఒక కిలో వాట్ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న వాహనానికి సబ్సిడీ రూ.2500 చొప్పున అందిస్తారు. గరిష్టంగా ఒక్కొ వెహికల్‌కు రూ.5 వేలు అందించనున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈవీ వెహికల్స్ వల్ల పర్యావరణానికి కూడా హాని జరగదు. దీంతో పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ సబ్సిడీని అందుకున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-DRIVE) పథకం కింద ఈ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది.