
NEET కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 2026 ఆగస్టు 11న నీట్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని దాదాపు అన్ని పార్టీలు మద్ధతు తెలిపాయి. విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఒక్క బీజేపీ తప్ప.. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలతో సహా అన్ని పక్షాలు మద్ధతు తెలిపాయి. అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్ చేశారు.
నీట్ ను రద్దు చేయాలనే తీర్మానాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కె.అరుణ్ రాజ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష సామాజిక న్యాయం, సమానాత్వం, రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అండర్ గ్రాడుయేట్ మెడికల్ అడ్మిషన్స్ వ్యవస్థను ఏకరీతిన నిర్వహిస్తున్న NEET వ్యవస్థ నుంచి వేరు చేసి రాష్ట్రాలకే వదిలేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.
కేంద్రం నిర్వహిస్తున్న నీట్ విధానం వలన గ్రామీణ, ఆర్థికంగా వెనకబడిన తరగతుల విద్యార్థులకు.. ముఖ్యంగా తమిళ్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఆరోపించారు. 12 ఏళ్ల స్కూలింగ్ తర్వాత.. సింగిల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం వలన.. విద్యార్థులు పూర్తిగా కోచింగ్ సెంటర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందనీ.. దీని వలన విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడులో మెడికల్ కోర్సుల అడ్మిషన్లు ఇంటర్ మార్కుల ఆధారంగా నిర్వహించాలని ప్రతిపాదించింది.
నీట్ పై డిబేట్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే భోజరాజన్. ప్రభుత్వ తీర్మాన్ని వ్యతిరేకించారు. నీట్ విద్యార్థులకు మంచి అవకాశం అంటూ.. ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా వాకౌట్ చేశారు.