
- చైనాకు కేంద్రం కౌంటర్.. వాస్తవాలు మారవని వెల్లడి
- అరుణాచల్‌లోని ప్రాంతాలకు భారత పేర్లపై చైనా అభ్యంతరం
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలు, భౌగోళిక విశేషాలకు భారతీయ పేర్లను ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్య చట్టవిరుద్ధమని, చెల్లనిదని కొట్టిపారేస్తూ.. ఆ సరిహద్దు రాష్ట్రంపై తన వాదనను మరోసారి వెల్లడించింది.
సోమవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ.. చైనా అసలు అరుణాచల్ ప్రదేశ్‌ను గుర్తించదని, దానిని జాంగ్నాన్ లేదా దక్షిణ టిబెట్ అని పిలుస్తామని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. రాష్ట్ర అధికారిక మ్యాప్‌లలో 27 కీలక ప్రాంతాలకు సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక భారతీయ పేర్లను రికార్డ్ చేసింది.
భౌగోళిక సూచనలలో గందరగోళాన్ని తొలగించడం, అధికారిక మ్యాప్‌లు, ప్రభుత్వ రికార్డులలో ఏకరూపతను తీసుకురావడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. అలాగే, పరిపాలనా సమన్వయం, మౌలిక సదుపాయాల ప్రణాళిక, విపత్తు నిర్వహణ సులభతరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లిస్ట్‌లో లాంగ్జు, జశ్వంత్ గఢ్, కామ్లాంగ్ నగర్, సున్‌పురా, ప్రీత్‌నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ మార్పులపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేంద్రం తోసిపుచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, ఈ వాస్తవాన్ని ఏ శక్తీ మార్చలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమనేది స్వయంసిద్ధమైన సత్యం, దీనిని ఏదీ మార్చలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తేల్చిచెప్పారు.