
డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌పై మ్యాచ్ మధ్యలో సొంత దేశ అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కువ షో చేయకుండా.. సక్కగా ఆట ఆడు అంటూ గట్టిగా అరిచాడు. ఆస్ట్రేలియా ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఫాక్స్ క్రికెట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. గురువారం (ఆగస్ట్ 13) ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సైట్ స్క్రీన్ దగ్గర ఒక వ్యక్తి నడుస్తూ ఉండటాన్ని గమనించిన స్మిత్ బౌలర్ బాల్ వేయకుండా అడ్డుకున్నాడు. అంపైర్లకు సైతం ఆ వ్యక్తిని పక్కకు వెళ్లామని చెప్పండంటూ సైగ చేశాడు.
దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ ఆలస్యంపై స్టేడియంలోని గ్యాలరీలో కూర్చొన్న ఓ ఆస్ట్రేలియా అభిమాని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘బ్యాటింగ్ చేయి స్మిత్.. రాజకుమారుడిలా ప్రవర్తించకు. నువ్వు ఆట కంటే పెద్దోడివి ఏమీ కాదు.. కాస్త సర్దుకుపో’’ అని గట్టిగా అరిచాడు. ఈ వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
అయితే, అభిమాని మాటలను పట్టించుకోని స్మిత్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ (6/55) ధాటికి ఆస్ట్రేలియా కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ (71) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.