
టాలెంట్ ఉండి, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ రచయితలకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. కథ ఉండి కూడా వెనుకడుగు వేస్తున్న ప్రతిభావంతులైన రైటర్లను ఆయన నేరుగా ఆహ్వానించారు. ఆగస్ట్ 14న జరిగిన ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేదికగా ఆయన టాలీవుడ్ యువ సృష్టికర్తలకు ఒక గొప్ప భరోసానిచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ తలుపులు తెరిచే ఉన్నాయి..
‘‘టాలెంట్ ఉండి కూడా ఆగిపోతున్నారా? అయితే నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్కి రండి.. కలిసి కథలపై చర్చిద్దాం’’ అంటూ నాగార్జున ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. రైటర్లు తమ కథలతో స్టూడియోను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ముందుగా అన్నపూర్ణ బ్యానర్ మేకర్స్ ఆ కథలు వింటారని, ఒకవేళ వారికి కనుక నచ్చితే, తాను స్వయంగా రంగంలోకి దిగి ఆ కథ వింటానని ఆయన భెరోసా ఇచ్చారు.
కథనం కొత్తదైతే వెంటనే నిర్మాణం..
కేవలం కథ చెప్పడమే కాదు.. ఆ కథనం (Screenplay) లో సరికొత్తదనం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సినిమాగా నిర్మిస్తానని నాగార్జున స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలు ఉన్న ప్రతిభావంతులకు తన బ్యానర్ ద్వారా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు.
తెలంగాణ మట్టి కథల కోసం అన్వేషణ..
గతంలో తెలంగాణ డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “తెలంగాణ మట్టి సువాసన, ఇక్కడి కల్చర్ అండ్ ఎమోషన్స్ ప్రతిబింబించేలా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక మంచి సినిమా రావాలి” అని ఆకాంక్షించారు. సరిగ్గా అదే కోణంలో ఒక మంచి కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలోనే ‘పల్లెబరుసు’ మూవీ తమ వద్దకు వచ్చిందని నాగార్జున గుర్తుచేశారు.
మట్టిలోని నిజమైన భావోద్వేగాలను, స్థానిక సంస్కృతిని తెరపైకి తీసుకురావాలన్న డిప్యూటీ సీఎం ఆశయానికి అనుగుణంగానే తాము అడుగులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రకటించిన ఈ ఓపెన్ ఆఫర్ టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా యువ రచయితలు మరియు దర్శకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
‘పళ్ళ బురుసు’ ఎలా ఉండబోతోందంటే?
ఈ సినిమా కథ 68 ఏళ్ల ఒంటరి వృద్ధుడు శాంభు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కథ అంతా ఒక చిన్న ‘టూత్ బ్రష్'(‘పళ్ల బురుసు’ ) చుట్టూనే తిరగనుంది. వేపపుల్లతో పళ్ళు తోముకోలేక, పంటి నొప్పితో బాధపడే ఒక ముసలి రైతు (తండ్రి).. తన కొడుకును ఒక టూత్ బ్రష్ కొనివ్వమని అడుగుతాడు. అక్కడి నుంచి మొదలైన ఈ చిన్న రిక్వెస్ట్.. ఆ పల్లెటూరిలో ఎలాంటి గందరగోళానికి దారితీసింది? చివరికి ఒక టూత్ బ్రష్ కోసం తండ్రీకొడుకులు జిల్లా కోర్టు మెట్లు ఎక్కే వరకు వ్యవహారం ఎలా వెళ్ళింది? అనే పాయింట్‌ను అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ డ్రామాగా మలిచారు దర్శకుడు ఉదయ్ చౌహాన్. మరి థియేటర్లలో నవ్వుల పూలు పూయించడానికి రెడీ అవుతోన్న ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.