
Harbhajan Singh: 15 ఏళ్ల వయసుకే మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న సంచలనం వైభవ్ సూర్యవంశీ. ప్రపంచస్థాయి దిగ్గజ బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో భయపెడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంత చిన్న వయసులోనే అతడి దూకుడు చూసి, అసలు ఈ కుర్రాడిని ఎలా అడ్డుకోవాలనేది బౌలర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై టీమిండియా మాజీ ఆఫ్‌స్పిన్నర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో స్పందిస్తూ, వైభవ్‌ను కట్టడి చేయడానికి ఒక ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ సూచించారు.
హర్భజన్ తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైభవ్ లాంటి విధ్వంసకర బ్యాటర్ ముందు డిఫెన్సివ్ ప్లాన్స్ అస్సలు పనిచేయవు. అతడిని కట్టడి చేయాలంటే బౌలింగ్‌తో కాదు.. ఫీల్డింగ్‌తో కొట్టాలన్నారు. తాను కనుక వైభవ్‌కు బౌలింగ్ చేస్తే, అతడి షాట్లకు తగినట్లుగా కాకుండా, తన బౌలింగ్ ప్లాన్‌కు తగ్గట్టుగానే ఫీల్డింగ్ సెట్ చేసుకుంటానని భజ్జీ స్పష్టం చేశారు. పరుగులు నియంత్రించాలని చూస్తే బౌలరే ఒత్తిడిలో పడతాడని, ప్రతి బంతికి వికెట్ తీసేందుకు ప్రయత్నించడమే ఏకైక మార్గమని అన్నారు. ఈ క్రమంలో వైభవ్ ఒక బంతిని సిక్సర్‌గా మలిచినా లేదా బౌలర్‌ను తీవ్రంగా బాదినా సరే బౌలర్ భయపడకూడదని హర్భజన్ సూచించారు. అది ఆటలో భాగమని గ్రహించి, తర్వాతి బంతికి కూడా అతడిని అవుట్ చేసేందుకే మళ్లీ దాడి చేయాలని చెప్పారు. వైభవ్ గొప్ప ఆటగాడని అంగీకరిస్తూనే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వికెట్ తీసే ఆలోచనతోనే ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
మరోవైపు, వైభవ్ ఆడుతున్న తీరుపై హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ వేదికపై ఈ స్థాయిలో ఆధిపత్యం చెలాయించే ఆటగాడిని తాను ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ఎంతటి దిగ్గజ బౌలర్ ఎదురైనా భయపడకపోవడమే వైభవ్ ప్రత్యేకత అని, అతడికి ఎక్కడ బంతి వేయాలో తెలియక ప్రపంచ టాప్ బౌలర్లు సైతం తీవ్రంగా ఆలోచిస్తున్నారని భజ్జీ గుర్తుచేశారు. ఒక 15 ఏళ్ల కుర్రాడికి ఇంతకంటే పెద్ద గౌరవం మరొకటి ఉండదని కొనియాడారు. సాధారణంగా ఈ వయసులో ఆటగాళ్లు క్రికెట్ ప్రాథమిక సూత్రాలు నేర్చుకునే దశలో ఉంటారు, కానీ వైభవ్ మాత్రం ఇప్పటికే పెద్ద వేదికలపై తన ముద్ర వేశాడు. అందుకే అతడిని ‘చిన్నపిల్లాడు’ అని తక్కువగా అంచనా వేయకూడదని, పెద్దలు కూడా చేయలేని పనులను ఈ కుర్రాడు చేసి చూపిస్తున్నాడని హర్భజన్ తెలిపారు.