Reading Time: 2 minutes
Bank Of America Jio Credit Ambani 18268 Crore Deal

Bank of America: ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అమెరికా దిగ్గజ బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో 49.9 శాతం వరకు వాటాను సుమారు రూ.18,268 కోట్లకు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ ఎన్‌బీ హోల్డింగ్స్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనుంది. ముందుగా ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా రూ.6,613 కోట్ల పెట్టుబడితో 4.29 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జియో క్రెడిట్‌లో 26.50 శాతం వాటా లభిస్తుంది. అనంతరం రూ.11,655 కోట్ల విలువైన 7.56 కోట్ల వారెంట్లను ఎన్‌బీ హోల్డింగ్స్ సబ్‌స్క్రైబ్ చేయనుంది. ఈ వారెంట్లను 18 నెలల్లోపు ఈక్విటీ షేర్లుగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జియో క్రెడిట్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాటా 49.90 శాతానికి చేరుతుంది.

రెండేళ్లలోనే రూ.30,667 కోట్ల ఆస్తులు

జియో క్రెడిట్‌ను సుమారు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. దీని ద్వారా చిన్న వ్యాపారాలు, రిటైల్ కస్టమర్లకు రుణాలు అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ కంపెనీ ద్వారా గృహ రుణాలను కూడా అందిస్తున్నారు. 2026 జూన్ 30 నాటికి కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) రూ.30,667 కోట్లకు చేరుకున్నాయి. అయితే వ్యక్తిగత రుణాలు, ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాల రంగంలోకి జియో క్రెడిట్ ఇంకా ప్రవేశించలేదు. ఈ రంగాలను గతంలో కీలక లక్ష్యాలుగా పరిగణించినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఇతర రుణ విభాగాలపై దృష్టి సారిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్న జియో వ్యూహానికి తాజాగా ఒప్పందం మరింత బలం చేకూర్చనుందని అంటున్నారు. ఇప్పటికే బీమా రంగంలో జర్మనీకి చెందిన అలియాంజ్‌తో, మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌తో జియో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఉన్న డిజిటల్ సామర్థ్యాలు, భారత మార్కెట్‌పై అవగాహనతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచవ్యాప్త ఆర్థిక సేవల నైపుణ్యం తోడు కానుంది. అయితే ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా భారత రిటైల్ రుణ వ్యాపారంలోకి నేరుగా ప్రవేశిస్తున్నట్లు భావించకూడదని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.

భారత్‌పై BofA భారీ నమ్మకం
ఈ ఒప్పందంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విస్తృతమైన, విశ్వసనీయమైన, అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థ అవసరమన్నారు. టెక్నాలజీ, ప్రపంచ స్థాయి నైపుణ్యాల సహాయంతో భారతీయులకు రుణ సేవలను మరింత సింపుల్‌గా, పారదర్శకంగా అందించడంలో ఈ ఒప్పదం కీలక ముందడుగని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ బ్రయాన్ మోయ్‌నిహాన్ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్లలో ఒకటని అన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ సమయంలోనే గణనీయమైన స్థాయికి చేరుకుందని, రెండు కంపెనీల బలాలు కలిస్తే ఆర్థిక సేవల వినియోగం మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని తెలిపారు.