Reading Time: 2 minutes

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం: ఆ ప్రతిపాదనేదీ లేదు.. ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (పీఆర్ఎల్ఐఎస్) కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్​పై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను తిప్పి పంపించినట్లు వెల్లడించింది.

న్యాయపర చిక్కులు, టెక్నికల్ అంశాలను చూపుతూ ఈ ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సోమవారం రాజ్య సభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌‌భూషణ్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు.

జాతీయ హోదా ఇవ్వాలంటే ముందుగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సంబంధిత ప్రాజెక్టు సాంకేతిక –ఆర్థికపరమైన అంశాలను అంచనా చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత జల మంత్రిత్వ శాఖకు చెందిన నీటిపారుదల, వరదల నిర్వహణ, బహులార్ధక సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణానది జలాల వినియోగంపై ఆధారపడి నిర్మించనున్న ప్రాజెక్ట్ అని తెలిపారు. అలాగే కృష్ణానది జలాల వివాద ట్రిబ్యునల్ -II టెర్ట్మ్ అఫ్​ రిఫరెన్స్ లో ఉన్న అంతరాష్ట్ర అంశాలతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ముడిపడి ఉందన్నారు. దీంతో కృష్ణానది వివాదాల క్రిమినల్ అంశం ప్రస్తుతం ‘సబ్-జ్యూడిస్’ (న్యాయస్థాన విచారణలో)గా న్యాయస్థానాల పరిధిలో ఉందని వెల్లడించింది. ఈ కారణంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై సాంకేతికాంశాల పరిశీలన చేపట్టడం సాధ్యపడదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా ఆశించిన పూర్తి ప్రయోజనాలను సాధించేలా సమగ్ర ప్రణాళికతో రావలసిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌‌ను తిరిగి పంపించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర పథకాల కింద ఆర్థిక సహాయం లేదా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి సీడబ్ల్యూసీ సాంకేతిక పరిశీలన, ఆ తర్వాత వాటర్ రిసోర్సెస్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి కృషి సించాయ్​ యోజన– అక్యూలరేటెడ్ ఇరిగేషన్ బెన్ఫిట్ ప్రోగ్రాం (పీఎంకేఎస్ వై–ఏఐబీపీ) గైడ్ లైన్స్ ప్రకారం.. అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులకే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి సమాధానంలో పొందుపరిచారు.

కాగా.. గతేడాది మార్చి 27న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే ప్రశ్నను లోక్ సభలో లేవనెత్తగా.. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సెప్టెంబర్ 2022లో సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వలేమని 2024 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిప్పి పంపినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.