Reading Time: 2 minutes
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ AIR 3 కొట్టిన అనన్య రెడ్డి.. ప్రజంట్ పోస్టింగ్ ఎక్కడ.. ఏ క్యాడర్.. ?

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ఆల్‌ ఇండియా మూడో ర్యాంక్‌ను సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మొదటి ప్రయత్నంలోనే ఈ అరుదైన విజయం సాధించడం, ఎలాంటి కోచింగ్ లేకుండా స్వయంకృషితో రాణించడం ఆమె పట్టుదలకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకు సాధించిన వ్యక్తిగా అనన్య రెడ్డి నిలిచారు.

విద్యా నేపథ్యం, సివిల్స్ వైపు ఆసక్తి:

అనన్య పదో తరగతి మహబూబ్‌నగర్‌లో, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మిరాండా హౌస్ కళాశాలలో జాగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే చరిత్ర, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులపై ఆమెకు సహజమైన ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తే ఆమెను సివిల్స్ వైపు మళ్ళించింది. తమ తాతగారు చిన్నప్పుడు సరదాగా జిల్లా కలెక్టర్‌ను చూపించి, తాను కూడా ఇలాంటి ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పిన మాటలు తన మనసులో యూపీఎస్సీ విత్తనాన్ని నాటాయని అనన్య గుర్తు చేసుకున్నారు.

ప్రిపరేషన్ వ్యూహం:

అనన్య రెడ్డి తన ప్రిపరేషన్‌కు కస్టమైజ్డ్ ప్లాన్‌ను రూపొందించుకున్నారు. ప్రతి యాస్పరెంట్ తమ బలాలు, బలహీనతలను అర్థం చేసుకుని సొంత ప్రణాళికతో ముందుకు సాగాలని ఆమె సలహా ఇచ్చారు. ప్రిలిమ్స్ కోసం విస్తృతంగా అధ్యయనం చేశారు. అన్‌కన్వెన్షనల్ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ మెటీరియల్‌ను రిఫర్ చేసి, రివిజన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఎలిమినేషన్ స్ట్రాటజీలో సహాయపడిందని తెలిపారు. మెయిన్స్‌కు రివిజన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించారు, తక్కువ మెటీరియల్‌ను చదివినప్పటికీ, అనేకసార్లు రిపీట్ చేయడం వల్ల పరీక్ష రోజున అది చాలా సహాయపడిందని వివరించారు. ఇంటర్వ్యూ దశ కొంచెం ట్రిక్కీగా అనిపించిందని, అయితే డీఏఎఫ్ (డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్), గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించి, నిజాయితీగా సమాధానాలు ఇవ్వడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రయత్నించానని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్‌కు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నారు. ఆంత్రోపాలజీ ఆప్షనల్ కోసం ఢిల్లీలోని వేథాస్ ఐసీఎస్ నుంచి మూడు నెలల పాటు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నారు. యూట్యూబ్, టాపర్ టాక్స్, బ్లాగుల్లో లభించే టాపర్ నోట్స్‌ వంటి డిజిటల్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు.

కుటుంబ మద్దతు, ఒత్తిడిని అధిగమించడం:

సివిల్ సర్వీసెస్ వంటి కఠినమైన పరీక్షకు కుటుంబ మద్దతు అత్యంత కీలకమని అనన్య నొక్కి చెప్పారు. తన తల్లిదండ్రులు, పెద్దనాన్న, కజిన్స్, స్నేహితులు తనకు సంపూర్ణ స్వేచ్ఛను, నైతిక మద్దతును అందించారని తెలిపారు. తన తండ్రి సెమీ అగ్రికల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉండగా, తల్లి గృహిణి అని పేర్కొన్నారు. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఒత్తిడి సహజమని, దానిని అధిగమించడానికి తాను క్రికెట్ మ్యాచులు చూడటం, పుస్తకాలు చదవడం (నవలలు, ఫిక్షన్, నాన్-ఫిక్షన్), అప్పుడప్పుడు ఆర్టికల్స్, పద్యాలు రాయడం వంటివి చేసేదాన్ని అని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం ద్వారా మానసిక ప్రశాంతత పొందేదాన్నని వివరించారు.

లక్ష్యం, స్ఫూర్తి:

తొలుత పరీక్ష పాస్ అవ్వాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ మొదలుపెట్టిన అనన్య, దేశంలోని సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత ప్రజాసేవ చేయాలనే తపన పెరిగిందని తెలిపారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తెలంగాణకు చెందిన స్మితా సబర్వాల్ (ఐఏఎస్), మహేష్ భగవత్ (ఐపీఎస్) వంటి సివిల్ సర్వెంట్ల పనితీరు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆశావహులకు సందేశం: సివిల్ సర్వీసెస్ ఆశావహులకు అనన్య రెడ్డి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఇది సవాలుతో కూడిన ప్రయాణమని, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. చదువు, సామాజిక జీవితం మధ్య సమతుల్యత పాటించడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. కేవలం కష్టపడటమే కాకుండా, తెలివిగా కష్టపడాలని (వర్క్ స్మార్ట్) ఉద్బోధించారు. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించి, పరీక్ష డిమాండ్లను అర్థం చేసుకోవాలని సూచించారు. ఎవరినీ గుడ్డిగా అనుసరించవద్దని, తమ బలాలు, బలహీనతలను విశ్లేషించుకుని సొంత ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఎప్పటికీ ఆశ వదులుకోవద్దని అనన్య స్పష్టం చేశారు.

కేడర్, ప్రజంట్ పోస్టింగ్:

అనన్య రెడ్డి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ట్రైనింగ్ అనంతరం.. ఆమె మహారాష్ట్ర క్యాడర్‌కు ఎంపికయ్యారు. 28-04-2025 నుంచి నాందేడ్‌లో సూపర్‌న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.