Reading Time: 2 minutes
WTC Final: 9 టెస్టులు.. 7 విజయాలు.. టీమిండియా ఫైనల్‎కు చేరాలంటే లెక్క ఇదే

WTC Final: భారత క్రికెట్ జట్టు 2021, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సైకిల్‌లో భారత జట్టు అసలు ఫైనల్ చేరడంలో విఫలమైంది. ప్రస్తుతం జరుగుతున్న 2025-27 WTC సైకిల్‌లో గిల్ సారథ్యంలోని టీమిండియా మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే రాబోయే మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఈ క్రమంలో భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం WTC 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా 5వ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు ఇప్పటివరకు ఈ సైకిల్‌లో 9 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది, 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం భారత జట్టు విజయం సాధించిన పాయింట్ల శాతం 48.15 గా ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో ముగిసిన సుదీర్ఘ సిరీస్ డ్రా కావడం, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లలో వచ్చిన ఫలితాలు ఈ సైకిల్‌లో భారత PCTపై ప్రభావం చూపాయి.

రాబోయే 9 టెస్టులు.. గెలవాల్సిన మ్యాచ్‌ల లెక్కలు ఇవే

ఫైనల్ రేసులో సురక్షితంగా నిలవాలంటే భారత్ ముందుకు ఇంకా 9 టెస్టు మ్యాచ్‌ల అవకాశం ఉంది. ఇందులో శ్రీలంకపై 2 టెస్టులు, న్యూజిలాండ్‌పై 2 టెస్టులు మరియు ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టెస్టుల సిరీస్ ఉన్నాయి. టీమిండియా ఫైనల్ చేరడానికి ఉన్న అవకాశాలు :

7 లేదా అంతకంటే ఎక్కువ విజయాలు: మిగిలిన 9 మ్యాచ్‌లలో భారత్ కనీసం 7 మ్యాచ్‌లు గెలిచినా లేదా 8 విజయాలు సాధించినా PCT సునాయాసంగా 60 శాతం కంటే పెరుగుతుంది. దీంతో దాదాపుగా WTC ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది.

అన్ని 9 మ్యాచ్‌లు గెలిస్తే: రాబోయే అన్ని మ్యాచ్‌లలో భారత్ విజయఢంకా మోగిస్తే ఎలాంటి ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ చేరుకుంటుంది.

6 విజయాలు సాధిస్తే రిస్కే: ఒకవేళ భారత్ కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, మిగిలిన 3 మ్యాచ్‌లలో 2 డ్రా చేసి 1 ఓడిపోతే మాత్రం పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతుంది. దీనివల్ల PCT 60 శాతం కంటే కిందకు పడిపోయి, ఇతర టీంల జయపజయాలపై ఆధారపడాల్సి వస్తుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి