Reading Time: 1 minute
Asian Games 2026 India Vs Pakistan Cricket Match Final

India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ జట్ల మధ్య బిగ్ ఫైట్ ఆరంభంలోనే చూద్దామనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురుకానుంది. ఐచి-నాగోయా వేదికగా జరిగే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల క్రికెట్ విభాగాల్లో ఇరుజట్లు వేర్వేరు సమూహాల్లో ఉన్నందున ప్రారంభ దశలోనే తలపడే అవకాశం లేదు. ఇరుజట్లు తమ తమ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసి ముందంజ వేస్తే, కేవలం గోల్డ్ మెడల్ లేదా బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లలో మాత్రమే భారత్-పాక్ సమరం సాధ్యమవుతుంది. పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్‌ జట్లు టాప్-2 సీడింగ్‌లో ఉండటంతో నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబర్ 28న జరిగే క్వార్టర్ ఫైనల్-2లో భారత్ ఆడుతుండగా, క్వార్టర్ ఫైనల్-1లో పాకిస్థాన్‌ బరిలోకి దిగుతుంది. డ్రా ప్రకారం, అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్స్ విజేతల ఆధారంగా అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ ఫైనల్ లేదా బ్రాంజ్ మెడల్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లోనే ఈ సాంప్రదాయ ప్రత్యర్థుల పోరు సాధ్యపడుతుంది. ఈ విభాగంలో శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా నేరుగా క్వార్టర్స్‌కు చేరగా.. అఫ్గానిస్తాన్, నేపాల్, హాంకాంగ్, చైనా, జపాన్, మలేషియా, ఒమన్ జట్లు గ్రూప్ స్టేజ్ ద్వారా క్వార్టర్స్ రేసులో నిలవనున్నాయి.

మహిళల విభాగంలోనూ ఇదే తరహా డ్రా అమల్లో ఉంది. భారత మహిళల జట్టు నంబర్-1 సీడ్‌గా ఉండగా, పాకిస్థాన్‌ నంబర్-4గా ఉంది. భారత్ తన క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌తో తలపడనుండగా, సెమీస్‌కు చేరితే బంగ్లాదేశ్ లేదా హాంకాంగ్‌తో ఆడాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్థాన్‌ క్వార్టర్స్‌లో థాయిలాండ్‌తో, గెలిస్తే సెమీస్‌లో శ్రీలంక లేదా మలేషియాతో తలపడుతుంది. కాబట్టి మహిళల విభాగంలోనూ భారత్-పాక్ మ్యాచ్ చూడాలంటే సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్ లేదా బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక, ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనుండగా, టీ20 ఫార్మాట్‌లో సాగే క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17 నుంచే నాగోయాలోని పాలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. భారత్ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ (పురుషుల జట్టు), హర్మన్‌ప్రీత్ కౌర్ (మహిళల జట్టు) సారథ్యంలో బలమైన జట్లను ప్రకటించింది. అయితే ఇరుజట్ల మ్యాచ్ కేవలం ఫలితాలపై ఆధారపడి ఉన్నందున, ఏ దశలోనైనా ఒక జట్టు ఓడిపోతే భారత్-పాక్ సమరం లేకుండానే టోర్నీ ముగిసే అవకాశం కూడా ఉంది.