
దేశంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై మరోసారి ఆందోళన కలిగించే లెక్కలు బయటకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు దాదాపు 10 వేల మేర తగ్గాయి. 2024-25లో దేశంలో 8,89,806 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 8,79,940కి పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 9,866 పాఠశాలలు తగ్గాయి. ఈ తగ్గుదలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. ఈ 9,866 పాఠశాలలన్నీ విద్యార్థులు లేక మూసివేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. పాఠశాలలను ప్రారంభించడం, మూసివేయడం, విలీనం చేయడం, రేషనైలేజేషన్ చేయడం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి ఈ సంఖ్యను మూసివేసిన ప్రభుత్వ బడులుగా కాకుండా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలల తగ్గుదలగా చూడాలి.
స్కూళ్ల లెక్కలు..
అయితే సంఖ్య మాత్రం చిన్నది కాదు. దేశంలో 2024-25లో అన్ని స్థాయిలను కలిపి 14.71 లక్షల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 10.13 లక్షలు ప్రభుత్వ పాఠశాలలు. ఈ పాఠశాలల్లో మొత్తం 24.69 కోట్ల మంది విద్యార్థులు, 1.01 కోట్ల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తాజా 2025-26 UDISE+ లెక్కల్లో మొత్తం పాఠశాలలు 14.66 లక్షలకు, ప్రభుత్వ పాఠశాలలు 10.05 లక్షలకు చేరాయి. అంటే అన్ని స్థాయిలను కలిపి చూసినా ప్రభుత్వ పాఠశాలల నెట్‌వర్క్ తగ్గుతూ వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తాజాగా లోక్‌సభలో వెల్లడైన ఎలిమెంటరీ పాఠశాలల లెక్కలు చూస్తే తెలంగాణలో 2024-25లో 22,983 ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు ఉండగా.. 2025-26లో 21,022కి తగ్గాయి. అంటే ఒక్క ఏడాదిలో 1,961 పాఠశాలలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో 37,449 నుంచి 36,003కి తగ్గాయి. అంటే 1,446 పాఠశాలల తగ్గాయి. దేశవ్యాప్తంగా అత్యధిక తగ్గుదల నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానాల్లో ఉంది. ఇది కేవలం రెండు రాష్ట్రాల సంఖ్యల కథ కాదు. ఇది గ్రామాల్లో మారుతున్న జనాభా, కుటుంబాల వలసలు, పిల్లల సంఖ్య తగ్గడం, ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు, ప్రభుత్వ పాఠశాలలపై మారుతున్న నమ్మకం.. ఇలా అనేక అంశాల కలయిక ఉంది.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2024-25 UDISE+ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 36.43 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 2025-26లో ఈ సంఖ్య సుమారు 34.93 లక్షలకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలల ఎన్‌రోల్ మెంట్‌లో సుమారు 1.5 లక్షల తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా తగ్గుతోంది. అందుబాటులో ఉన్న UDISE లెక్కల ప్రకారం 2014-15లో సుమారు 46,666 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2024-25లో ఆ సంఖ్య 44,886కి వచ్చింది. అంటే దశాబ్దంలో నికరంగా దాదాపు 1,780 పాఠశాలల తగ్గుదల ఉంది. 2025-26లో ఈ సంఖ్య మరింత తగ్గి సుమారు 44,222కి చేరినట్లు UDISE ఆధారిత డేటా సూచిస్తోంది. కానీ ఏపీ కథలో మరొక పెద్ద మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో సుమారు 36.4 లక్షల మంది ఉంటే.. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 47 లక్షల మంది చదువుతున్నారు. అంటే రాష్ట్రంలోని పిల్లల్లో గణనీయమైన భాగం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ విద్యాసంస్థల వైపు వెళ్తున్నారు.
పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు?
తెలంగాణలో మరో రకమైన సంక్షోభం కనిపిస్తోంది. అక్కడ జీరో ఎన్‌రోల్‌మెంట్, లో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ సంఖ్య పెరుగుతుంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం, మరికొన్నింటిలో 10 మందిలోపే ఉండటంతో వాటిని కొనసాగించాలా? విలీనం చేయాలా? అనే ప్రశ్న ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలు కూడా బయటపడుతున్నాయి. UDISE+ 2025 ఆధారంగా వచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 16 శాతం ఒక్క తరగతి గదితోనే నడుస్తున్నాయి. అంటే ఒకే గదిలో వేర్వేరు తరగతుల పిల్లలను బోధించాల్సిన పరిస్థితి ఉన్న పాఠశాలలు గణనీయంగా ఉన్నాయి.
బడులను ఎందుకు తగ్గిస్తోంది?
ఒక గ్రామంలో ఒకప్పుడు 50 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అదే గ్రామంలో 5 లేదా 10 మంది మాత్రమే ఉంటే.. ఇద్దరు, ముగ్గురు టీచర్లతో ప్రత్యేక పాఠశాల కొనసాగించడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారుతుంది. మరోవైపు పక్క గ్రామంలో వందల మంది పిల్లలు ఉన్నా.. అక్కడే టీచర్ల కొరత ఉండొచ్చు. ఇదే కారణంగా రేషనలైజేషన్ పేరుతో కొన్ని పాఠశాలలను విలీనం చేయడం, విద్యార్థులను సమీపంలోని పెద్ద పాఠశాలలకు తరలించడం జరుగుతోంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. బడి ఎందుకు ఖాళీ అయింది? పిల్లలు పుట్టడం తగ్గిందా? గ్రామం నుంచి కుటుంబాలు వలస వెళ్లాయా? తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్‌కి మార్చారా? ప్రభుత్వ స్కూల్‌లో టీచర్లు, ఇంగ్లిష్ మీడియం, మౌలిక వసతులు, ఫలితాలపై నమ్మకం తగ్గిందా?
ఈ కారణాల్లో ఏది ప్రధానమో తెలుసుకోకుండా కేవలం పిల్లలు లేరు.. కాబట్టి బడి అవసరం లేదనినిర్ణయం తీసుకుంటే అసలు సమస్య పరిష్కారం కాదు.
ప్రభుత్వ బడికి పోటీ ఎవరిది?
ఒకప్పుడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలే ప్రధాన విద్యా కేంద్రం. ఇప్పుడు అదే గ్రామంలో రెండు, మూడు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలు కనిపిస్తున్నాయి.
తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్‌కి వెళ్తున్నారు?
ఇంగ్లిష్ మీడియం, డిసిప్లిన్, టెక్నాలజీ, మంచి ఫలితాలు, తల్లిదండ్రులతో నిరంతర కమ్యూనికేషన్, భవిష్యత్తుపై నమ్మకం అనే అంశాలున్నాయి. ఇవే ప్రైవేట్ స్కూల్ తనను తాను అమ్ముకునే అంశాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఫీజు లేదు. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అయినా కొంతమంది తల్లిదండ్రులు అప్పు చేసి అయినా ప్రైవేట్ స్కూల్‌కి పిల్లలను పంపుతున్నారు. అంటే సమస్య డబ్బు మాత్రమే కాదు.. నమ్మకం కూడా.
టీచర్లు లేరా? పిల్లలు లేరా?
దేశంలో మొత్తం 1.01 కోట్లకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు సుమారు 24.69 కోట్లు. కాబట్టి దేశంలో టీచర్ల సంఖ్యే అసలు సమస్య అని చెప్పడం పూర్తి నిజం కాదు. అసలు సమస్య చాలా ప్రాంతాల్లో టీచర్ల అసమాన పంపిణీ. ఒక పాఠశాలలో 10 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉండొచ్చు. మరో పాఠశాలలో 150 మంది పిల్లలకు ఇద్దరే ఉండొచ్చు. అందుకే టీచర్లను అవసరానికి అనుగుణంగా పునర్విభజించడం తప్పనిసరి. కానీ ఆ ప్రక్రియలో చిన్న గ్రామంలోని పాఠశాలనే మూసేయడం ఒక్కటే పరిష్కారం కాకూడదు.
బడి మూసిన తర్వాత పిల్లల ప్రయాణం ఎంత?
ఒక పాఠశాల మూసేశారు. అక్కడి 8 మంది పిల్లలను మరో గ్రామంలోని పాఠశాలకు పంపారు. ఎంత దూరం? బస్సు ఉందా? వర్షాకాలంలో రోడ్డు పరిస్థితి? చిన్నారులు ప్రతిరోజూ వెళ్లగలరా?
బాలికల భద్రత ఎలా? ప్రయాణ ఖర్చు ఎవరిది? ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా కేవలం పాఠశాల నిర్వహణ ఖర్చు తగ్గిందని చెప్పడం సరిపోదు. అదే సమయంలో స్కూల్ దూరమే దేశవ్యాప్తంగా డ్రాపౌట్స్‌కు ప్రధాన కారణమని కూడా చెప్పలేం. అంటే పాఠశాల మూసివేతను డ్రాపౌట్స్‌కు నేరుగా ముడిపెట్టే ముందు స్థానిక స్థాయిలో పిల్లల ప్రయాణం, హాజరు, డ్రాపౌట్ డేటాను పరిశీలించాలి.
బడ్జెట్ పెడుతున్నాం.. ఫలితం ఎక్కడ?
విద్యకు ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. కానీ ప్రశ్న కేటాయింపుల పరిమాణం మాత్రమే కాదు.. ఆ డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది? ఆంధ్రప్రదేశ్ 2026-27లో విద్యకు తన మొత్తం వ్యయంలో సుమారు 11.7 శాతం కేటాయించింది. తెలంగాణలో ఈ వాటా సుమారు 9.8 శాతం. రెండు రాష్ట్రాలూ విద్యపై కేటాయిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల సగటు 14.5 శాతంతో పోలిస్తే ఈ వాటా తక్కువగా ఉందని PRS విశ్లేషణ చెబుతోంది. బడ్జెట్ ఎంత అన్నదానికంటే, ఒక్కో పిల్లపై ఎంత? ఒక్కో పాఠశాలపై ఎంత? టీచర్ నాణ్యతపై ఎంత? మౌలిక వసతులపై ఎంత? లెర్నింగ్ అవుట్‌కమ్స్ మెరుగుపడటానికి ఎంత? అనేదిగా మారాలి.
లోపం ఎక్కడుంది?
ప్రభుత్వ పాఠశాలల సమస్యకు ఒక్క కారణం లేదు. మొదటి లోపం.. ఎన్‌రోల్‌మెంట్ తగ్గితే కారణాన్ని వెతకకుండా స్కూల్‌ను చూస్తున్నాం. రెండో లోపం.. పాఠశాలను భవనంగా చూస్తున్నాం. విద్యా వ్యవస్థగా చూడడం లేదు. మూడో లోపం.. టీచర్ల సంఖ్యను చూస్తున్నాం. టీచర్లు ఎక్కడ ఉన్నారో చూడడం లేదు. నాలుగో లోపం.. పిల్లలు ప్రభుత్వ బడి నుంచి ప్రైవేట్‌కి ఎందుకు వెళ్తున్నారో సిస్టమేటిక్‌గా ట్రాక్ చేయడం లేదు. ఐదో లోపం.. స్కూల్ మూసిన తర్వాత పిల్లలపై పడే ప్రయాణ, భద్రత, డ్రాపౌట్ ప్రభావాన్ని ముందుగానే లెక్కించడం లేదు.
మరి ఏం చేయాలి?
మొదటగా జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉంచి వెంటనే క్లోజర్ అనే విధానం ఉండకూడదు. కనీసం మూడు సంవత్సరాల ఎన్‌రోల్‌మెంట్ ట్రెండ్ చూడాలి. ప్రతి పాఠశాల మూసివేతకు ముందు స్కూల్ క్లోజర్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ తప్పనిసరి చేయాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎక్కడికి తరలిస్తారు? ఎంత దూరం? రవాణా ఉందా? బాలికలు ఎంతమంది? SC, ST పిల్లలు ఎంతమంది? ప్రయాణ ఖర్చు ఎంత? చదువు మానేసే ప్రమాదం ఎంత? ఈ మొత్తం డేటా బయటపెట్టిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ప్రతి గ్రామానికి స్కూల్ యాక్సిస్ మ్యాప్ ఉండాలి. గ్రామం నుంచి సమీప ప్రభుత్వ పాఠశాల దూరం, రవాణా, విద్యార్థుల సంఖ్య, టీచర్ల సంఖ్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. చిన్న పాఠశాలలను మూసివేయడం కంటే స్కూల్ క్లస్టర్ మోడల్‌ను బలోపేతం చేయాలి. అవసరమైన చోట టీచర్లను పంచుకోవచ్చు. సబ్జెక్ట్ టీచర్స్‌ను క్లస్టర్ స్థాయిలో ఉపయోగించవచ్చు. ప్రభుత్వ బడులకు మళ్లీ నమ్మకం తీసుకురావాలి. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ లెర్నింగ్, మంచి తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, క్రీడా సదుపాయాలు, ఫలితాలు.. ఇవన్నీ ప్రభుత్వ బడికి కూడా హక్కులే. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆన్యువల్ రిపోర్ట్ కార్డు ఇవ్వాలి.
విద్యార్థులు ఎంతమంది? టీచర్లు ఎంతమంది? హాజరు ఎంత? లెర్నింగ్ అవుట్‌కమ్ ఎంత? బడ్జెట్ ఎంత? ఒక్కో పిల్లపై ఖర్చు ఎంత? ఈ డేటా ప్రజల ముందుండాలి.
అసలు ప్రశ్న ..
ప్రభుత్వ బడికి వచ్చే పిల్లల సంఖ్య కొన్నిచోట్ల నిజంగానే తగ్గుతోంది. జనాభా మారుతోంది. కుటుంబాలు వలస వెళ్తున్నాయి. పట్టణీకరణ పెరుగుతోంది. ప్రైవేట్ విద్యపై ఆకర్షణ పెరుగుతోంది.
కానీ పిల్లలు లేరని బడి మూసే ముందు.. పిల్లలు ఎందుకు లేరని అడగాలి. ఒక గ్రామంలో బడి మూసేయడం వల్ల ప్రభుత్వానికి ఒక భవనం నిర్వహణ ఖర్చు తగ్గొచ్చు. కానీ అదే బడి పిల్లలకు దగ్గరగా లేకపోతే.. వారి ప్రయాణ సమయం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఖర్చు పెరుగుతుంది. చిన్నారుల భద్రతపై ఆందోళన పెరుగుతుంది. కొన్ని కుటుంబాలు ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లవచ్చు. మరికొందరు పిల్లలను చదువుకు దూరం చేయవచ్చు. అందుకే ప్రభుత్వ పాఠశాల అనేది కేవలం ప్రభుత్వ ఖర్చు కాదు. అది ఒక గ్రామం భవిష్యత్తుపై పెట్టుబడి. దేశంలో 2024-25లో 10.13 లక్షలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల నెట్‌వర్క్ 2025-26లో 10.05 లక్షలకు చేరింది. ఎలిమెంటరీ స్థాయిలోనే ఒక్క ఏడాదిలో 9,866 ప్రభుత్వ పాఠశాలల తగ్గుదల నమోదైంది. అందులో తెలంగాణ 1,961, ఆంధ్రప్రదేశ్ 1,446 పాఠశాలల తగ్గుదలతో ముందున్నాయి.
బడిలో పిల్లలు లేరని బడి తలుపులు మూస్తున్నామా? లేక పిల్లలు బడిని ఎందుకు వదిలారో తెలుసుకునేలోపే తలుపులు మూస్తున్నామా అనేది ఆలోచించాలి. ఒక స్కూల్ మూసేది నాలుగు గోడలు మాత్రమే కాదు.. ఒక తరం కలలకు వెళ్లే దారిని కూడా మార్చుతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై నిర్ణయం ఖర్చు లెక్కతో కాదు.. పిల్లల భవిష్యత్తు లెక్కతో తీసుకోవాలి.