
హైదరాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈసీఐఎల్ (ECIL) ప్రాంతంలోని శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజిటేరియన్ హోటల్’లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ బయటపడిన పరిస్థితులు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.
ఈ తనిఖీల్లో హోటల్ కిచెన్ , స్టోరేజ్ ఏరియాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వంటగదిలోని ఫ్లోర్లు, గోడలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు జిడ్డుగా, జారుడుగా మారాయి. వంట గదిలో ఈగలు స్వైరవిహారం చేస్తున్నట్లు తేలింది. ఇక ఆహార పదార్థాల విషయానికి వస్తే.. సెమీ కుక్డ్ ఫుడ్‌ను ఎలాంటి కవర్లు, లేబుల్స్ లేకుండా ఇష్టానుసారంగా నిల్వ చేశారు. అంతేకాకుండా, కిచెన్‌లో కుళ్లిపోయిన కొబ్బరికాయలను గుర్తించి అధికారులు షాక్ అయ్యారు. కూరగాయలు , ఆహార పదార్థాలను ఏమాత్రం శుభ్రత పాటించకుండా నేలపైనె నిల్వ చేసినట్లు తేలింది.
హోటల్‌లో సరైన వెంటిలేషన్, వ్యర్థాలను వేరు చేయడానికి డస్ట్‌బిన్లు కూడా లేవు. వాషింగ్ , డ్రైనేజీ ప్రాంతాలు కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఫుడ్ హ్యాండ్లర్లు ఎలాంటి రక్షణ పరికరాలు ధరించకుండానే పనిచేస్తుండగా, సిబ్బందికి అసలు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ కూడా లేనట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, యాజమాన్యం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులను కూడా అధికారులకు సమర్పించలేకపోయింది.
నిబంధనలను గాలికి వదిలేసి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రాఘవేంద్ర హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు మరోసారి హెచ్చరించారు.