Reading Time: < 1 minute

Krishneswara Rao: ‘చందమామ కథలు’ నటుడు కన్నుమూత.. 1,500కుపైగా నాటకాల్లో నటించిన దిగ్గజం

Caption of Image.

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నాటకరంగ దిగ్గజం, రచయిత ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం (ఆగస్టు 11న) గుంటూరు జిల్లా ఏ.టి. అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ, నాటకరంగాల్లో విషాదం నెలకొంది.

పాఠశాల రోజుల నుంచే నాటకరంగంలోకి అడుగుపెట్టిన సౌభాగ్య కృష్ణేశ్వరరావు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో 1,500కుపైగా నాటకాల్లో నటించారు. ‘సంపద’, ‘రోజూ చస్తున్న మనిషి’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘గుర్తు తెలియని శవం’, ‘వాపస్’ వంటి నాటకాలను రచించి, ప్రదర్శించారు. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా సేవలందించారు. ఆయనకు అనేక నంది అవార్డులు లభించాయి.

కృష్ణేశ్వరరావు సినీ ప్రస్థానం..

ప్రముఖ నటుడు ఎం. ప్రభాకర రెడ్డి పరిచయంతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. తాను రచించిన ‘ప్రచండ భారతం’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ‘చందమామ కథలు’, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘గోపి గోపిక గోదావరి’, ‘ఇడియట్’, ‘విరూపాక్ష’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’ తదితర చిత్రాల్లో నటించారు.

►ALSO READ | Vikram Monkey: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్.. చియాన్ ఇంటికెళ్లిన వైల్డ్‌లైఫ్ అధికారులు

‘చందమామ కథలు’లో భిక్షగాడి పాత్రకు గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం అందుకున్నారు. నటుడిగా, రచయితగా, నాటకకర్తగా తెలుగు కళారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, నాటకరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.