
నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో స్థానిక పోక్సో న్యాయస్థానం (POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏకంగా 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.
2020 మే 30వ తేదీన మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ జాకీర్ బాబా అనే వ్యక్తి, సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ అత్యంత బలమైన వాదనలు వినిపించారు.
వాదనలు విన్న పోక్సో న్యాయస్థానపు న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు నేరం రుజువైనట్లు నిర్ధారించారు. కిడ్నాప్ నేరం కింద 5 సంవత్సరాలు, పోక్సో చట్టంలోని సెక్షన్ 3 మరియు 4 కింద మరో 20 సంవత్సరాలు.. మొత్తంగా నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. అంతేకాకుండా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సకాలంలో దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించిన అప్పటి ఎస్‌హెచ్‌ఓ డి. శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ బి. అఖిల్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరుల సహకారాన్ని న్యాయస్థానం అభినందించింది.