
- నేడు పలు అంశాలపై సంజయ్ బారు ప్రసంగం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ పరిణామాలు కంపెనీల లెక్కలను ప్రభావితం చేస్తున్నాయని, వాటిని అర్థం చేసుకోకుండా వ్యాపారం చేయడం కష్టమని హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(హెచ్‌ఎంఏ) అధ్యక్షుడు శరత్ చంద్ర మారోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర వారోత్సవాల సందర్భంగా హెచ్‌ఎంఏ, ఎఫ్‌టీసీసీఐ, ఎఫ్‌డీజీపీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ ఫెడరేషన్ హౌస్‌లో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించనున్నారని చెప్పారు.
సురానా ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ అనే అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత డాక్టర్ సంజయ్‌బారు ప్రసంగించనున్నారని అన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో తీసుకునే నిర్ణయాలు జీడిమెట్లలోని ఆర్డర్లను, ప్రాజెక్టుల లెక్కలను తలకిందులు చేస్తున్న తరుణంలో వార్తలకు, బ్యాలెన్స్ షీట్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు.
సంజయ్‌బారు నిజాం కాలేజీలోనే చదివారని, హెచ్‌యూవీలో ఆర్థికశాస్త్ర లెక్చరర్‌గా పనిచేశారన్నారు. జేఎన్‌యూ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా, ప్రధాన ప్రతినిధిగా సేవలందించారని తెలిపారు. సంచలనం సృష్టించిన ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకంతోపాటు హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ వంటి పలు ప్రముఖ పుస్తకాలను ఆయన రాశారని పేర్కొన్నారు.