
IND vs SL: భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లింది. బుమ్రా లేకపోవడం స్పష్టంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు. అయితే ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటును యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భర్తీ చేస్తాడని, అతడు భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్‌గా నిలుస్తాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ ఆడటం దాదాపు ఖాయం కాగా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బ్రార్‌కి టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చని మహరూఫ్ పేర్కొన్నారు.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన మహరూఫ్.. బుమ్రా బంతిని అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేయగలడని ఆ నైపుణ్యం భారత్‌కు తీవ్రంగా లోపిస్తుందని విశ్లేషించారు. మహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్ అయినప్పటికీ, బుమ్రాతో పోలిస్తే స్వల్ప తేడా ఉంటుందన్నారు. అయితే గుర్నూర్ బ్రార్ స్పీడ్, అతడు సాధించే ఎక్స్‌ట్రా బౌన్స్ ఈ మ్యాచ్‌లో నిర్ణయాత్మకంగా మారతాయని చెప్పారు. వార్మప్ మ్యాచ్‌లోనే గుర్నూర్ వేసిన బంతులకు టెస్ట్ జట్టులోని బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, కొందరి శరీరాలకు బంతులు కూడా తాకాయని ఆయన గుర్తుచేశారు. ఏ బ్యాటర్ రిథమ్‌నైనా దెబ్బతీసే సత్తా బ్రార్‌కు ఉందన్నారు.
గుర్నూర్ బ్రార్‌కు శ్రీలంక మైదానాలపై ఆడిన అనుభవం ఉంది. గతంలో శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్రార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైన్‌అప్‌ను కుప్పకూల్చాడు. తన వేగంతో, బౌన్స్‌తో లంక బ్యాటర్లను తీవ్ర భయందోళనలకు గురిచేశాడు. ఇప్పుడు కూడా గాల్ పిచ్‌పై అవకాశమొస్తే అదే స్థాయిలో వికెట్ల పండగ చేసుకునే సామర్థ్యం ఆయనకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గుర్నూర్ బ్రార్ రికార్డులను పరిశీలిస్తే ఆయన వికెట్లు తీసే నైపుణ్యం స్పష్టమవుతుంది. టీమిండియా తరఫున ఇప్పటివరకు ఆడిన 6 వన్డే మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 19 మ్యాచ్‌లు ఆడి 62 వికెట్లు పడగొట్టారు. ఈ అద్భుతమైన గణాంకాలు ఆయన బౌలింగ్ పవర్ ఏంటో నిరూపిస్తున్నాయి. లంక గడ్డపై ఈ యువ సంచలనాన్ని బరిలోకి దింపి లబ్ధి పొందాలని భారత జట్టు యాజమాన్యం కూడా ఆలోచిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..