Reading Time: 2 minutes

అభివృద్ధి పనులపై క్రెడిట్‌‌ వార్‌‌.. ఆదిలాబాద్‌‌లో ఎయిర్‌‌పోర్టు, సీసీఐపై పార్టీల మధ్య పోటాపోటీ

Caption of Image.
  • ఎయిర్​పోర్టు నిధులు తమ కృషేనంటున్న కాంగ్రెస్​, బీజేపీ 
  • సీసీఐపై బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య పంచాయితీ
  • సీసీఐ సాధన కమిటీలోనూ ఆధిపత్య పోరు

ఆదిలాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులపై ఆయా పార్టీల మధ్య క్రెడిట్‌‌ వార్‌‌ మొదలైంది. కాంగ్రెస్​, బీజేపీ నేతలు అభివృద్ధి పనుల ఘనత తమదేనని చెప్పుకుంటున్నాయి. ఎయిర్‌‌పోర్టు అంశంపై రెండు పార్టీల పోటీ నెలకొంది. తాజాగా మూతపడిన సీసీఐ సిమెంట్‌‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలోనూ బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నేతల మధ్య క్రెడిట్‌‌ పంచాయతీ మొదలైంది.

ఎయిర్‌‌పోర్టుపై ఎవరికివారే..
ఆదిలాబాద్‌‌ ప్రజల చిరకాల కోరిక అయిన ఎయిర్‌‌పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. భూసేకరణ కోసం అధికారులు సర్వే ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేయడంతో కాంగ్రెస్‌‌, బీజేపీ నేతలు వేర్వేరుగా సంబరాలు నిర్వహించి ఘనత తమదేనని ప్రకటించారు. ఎయిర్‌‌పోర్టు ఏర్పాటుకు రూ.2,278 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసిన ఘనత సీఎం రేవంత్‌‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్‌‌ నేతలు చెబుతున్నారు. ఇంద్రవెల్లి సభలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్‌‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం ఎయిర్‌‌పోర్టు ప్రాజెక్టు క్రెడిట్‌‌ కాంగ్రెస్‌‌కే దక్కుతుందని, గతంలో తానే దీనికి బీజం వేశానని పేర్కొన్నారు. బీజేపీ నేతలు క్రెడిట్‌‌ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఎయిర్‌‌పోర్టు సాధన తమ కృషి ఫలితమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. గతంలో తాము చేసిన ప్రయత్నాలతోనే ప్రాజెక్టు ముందుకు వచ్చిందని, కాంగ్రెస్‌‌ తమ కృషిని విస్మరించి క్రెడిట్‌‌ కొట్టేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎంపీ నగేశ్‌‌, ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌ కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొంటున్నారు.

సీసీఐపై బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ పంచాయితీ..
ఎయిర్‌‌పోర్టు విషయంలో కాంగ్రెస్‌‌, బీజేపీ మధ్య క్రెడిట్‌‌ పోటీ ఉండగా.. సిమెంట్‌‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంలో బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ మధ్య వివాదం మొదలైంది. మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలంటూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల రిలే దీక్షలు ప్రారంభించారు. మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఈ ఉద్యమానికి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారు. రిలే దీక్షలను ప్రారంభించి సంఘీభావం తెలిపారు.

అయితే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరించాలని కోరుతూ సాధన కమిటీ సభ్యులు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసినా పట్టించుకోవడం లేదని జోగు రామన్న ఆరోపిస్తున్నారు. సాధన కమిటీలో గౌరవ చైర్మన్‌‌ పదవి తమకే ఇవ్వాలని బీజేపీ నేతలు క్రెడిట్‌‌ కోసం పట్టుబడుతున్నారని విమర్శించారు. అయితే సాధన కమిటీలో చైర్మన్‌‌ పదవి లేదని, తాను కూడా కమిటీలో సభ్యుడిని కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.