
పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్లో డెడ్‌లాక్ కొనసాగుతోంది. సెషన్ మరో 48 గంటల్లో ముగుస్తున్నా.. ఇంతవరకూ కీలక బిల్లుల సంగతి తేలలేదు. మొన్నటిదాకా మంత్రులు సమాధానం చెప్పాలన్న ప్రతిపక్షం.. ఇప్పుడు ప్రభుత్వం ఓకే చెప్పాక కొత్తగా రాజీనామా రాగం ఎత్తుకుంది. సభ లోపల విపక్షాలు ఆందోళన చేస్తుంటే.. బయట అధికార పక్షం నిరసన ర్యాలీలు తీస్తోంది. ఏతావాతా అధికార, విపక్షాల మధ్య సభ నడిచే విషయంలో ఏకాభిప్రాయం అయితే కుదరదటం లేదు. పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్ ఎటూ తేలకుండా ముగిసేలా ఉంది. ప్రభుత్వం ఓ అజెండా అనుకుంది. అందుకోసం కొన్ని నెలలుగా కసరత్తు చేసింది. కానీ సర్కారు అనుకున్న అజెండాను విపక్షం అడ్డుకుంటోంది. ఏకంగా మంత్రుల రాజీనామాకు పట్టుబడుతోంది.
గత నెల ఇరవయ్యో తేదీన మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజు నుంచీ ఇప్పటివరకూ రభసకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. నిజానికి సెషన్ ప్రారంభానికి ముందు.. అధికార పక్షం.. ఎంపీల బలం పెంచుకుని ఏ బిల్లు పెట్టినా నెగ్గించుకోగలననే ధీమాను ప్రదర్శించింది. ఆ ఉద్దేశంతోనే కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని మరోసారి సభ ముందుకు తేవాలని గట్టిగా నిర్ణయించుకుంది. తద్వారా జమిలికి మార్గం సుగమం చేసుకుంటామని కూడా బీజేపీలో అంతర్గత చర్చలు జరిగాయి. కానీ పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్ తొలిరోజే.. విద్యార్థుల పార్లమెంట్ ముట్టడి రసాభాసగా మారటం.. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిరసనకారులకు భయపడి పార్లమెంట్ గేట్లు మూయాల్సి వచ్చింది. చివరకు పార్లమెంట్ లోపల నుంచి పోలీసులు విద్యార్థులపై తుపాకులు ఎక్కుపెట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్.. మొత్తం పార్లమెంట్ సెషన్ అజెండానే పూర్తిగా డిస్టర్బ్ చేసింది. విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో.. దేశమంతా అట్టుడికిపోయింది. దీంతో సభ లోపల కూడా విపక్షాలు లాఠీఛార్జ్ అంశాన్ని ఎత్తుకుని.. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అనూహ్యంగా జరిగిన పరిణామంతో దిక్కుతోచని అధికార పక్షం.. కొద్దిరోజుల తర్వాత ఈ వేడి చల్లారుతుందని తప్పుడు అంచనా వేసింది. కానీ సభలో తనను మాట్లాడనివ్వలేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలతో..రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. పార్లమెంట్ బయట ఆందోళనలతో విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే.. సభ లోపల నిరసనలతో మొదట అమిత్ షా సమాధానం కోసం డిమాండ్ చేసిన విపక్షం.. తర్వాత రాజీనామా డిమాండ్ ఎత్తుకుని కేంద్రానికి షాకిచ్చింది. చివరకు సభ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిరంతర సంప్రదింపుల తర్వాత కూడా విపక్షం ఎక్కడా మెట్టు దిగలేదు. విపక్షం ఏ స్థాయిలో సభను స్తంభింపజేసిందంటే.. సాధారణ బిల్లులు ప్రవేశపెట్టడం కూడా కష్టసాధ్యమైన దుస్థితి. ఆ నిరసనలు, గందరగోళం మధ్యే కొన్ని బిల్లుల్ని అధికార పక్షం మూజువాణి ఓటుతో గట్టెక్కించుకుంది. కానీ ఆ సందర్భంగా ప్రతిపక్షాల ప్రతిఘటన చూశాక.. ఇక కీలక బిల్లుల జోలికి వెళ్లడానికి సాహసించలేకపోయింది. అప్పటికీ డీలిమిటేషన్ గురించి విపక్షాలతో రోజువారీ సంప్రదింపులు జరిపినా..ఎక్కడా రాజీ కుదరలేదు. ఈ పరిస్థితుల్లో అమిత్‌షా సభకు వచ్చి సమాధానం ఇస్తారని కేంద్రం ప్రకటన చేసింది. అప్పటికీ విపక్షాలు శాంతించలేదు. సభ అదుపులోకి రాలేదు. అమిత్ షా ప్రసంగం అక్కర్లేదు.. సూటి ప్రశ్నలకు సమాధానం కావాలన్న రాహుల్.. రాజీనామా డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చారు. ఈలోగా మాన్‌సూన్ సెషన్ ముగింపు దగ్గరపడింది.
ఇప్పుడు కేవలం 48 గంటల సమయం ఉంది. ఈ స్థితిలో.. ఇంతవరకూ డెడ్‌లాక్ వీడని సమయంలో.. విపక్షం రాజీకి ఒప్పుకోని సందర్భంలో.. కీలక బిల్లులు ప్రస్తుతానికి అటకెక్కినట్టేననే వాదన వినిపిస్తోంది. పన్నెండేళ్లుగా అధికార పక్షం ట్రాప్‌లో పడి సభలో తాము అనుకున్నట్టుగా వ్యవహారం చేయలేకపోయిన విపక్షాలు.. ఈసారి మాన్‌సూన్ సెషన్లో మాత్రం జూలు విదిల్చాయి. విద్యార్థుల ఉద్యమం, లాఠీఛార్జ్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని అధికార పక్షాన్ని చేష్టలుడిగేలా చేశాయి. సరే రాజ్యసభలో అంటే విపక్షాలకూ తగిన సంఖ్యా బలం ఉంది. కానీ లోక్‌సభలో గుప్పెడు మంది సభ్యులతోనే విపక్షం చేసిన రభస అంతా ఇంతా కాదు. ఇంతకాలం సభలో సంఖ్యాబలం లేకుండా ఏం చేయగలం అని రొటీన్ డైలాగ్ చెప్పిన విపక్షం.. ఇప్పుడు మాత్రం అదే సంఖ్యాబలంతో ఎక్కువ సంఖ్యలో ఎంపీలున్న అధికారపక్షంతో ఢీ అంటే ఢీ అని తలపడింది. అంతేకాదు చివరకు ఆధిక్యతను ప్రదర్శించింది. విపక్షం దూకుడు చూసి.. కొందరు అధికార పక్ష ఎంపీలు కూడా అనుమానపడ్డారు. ఇన్నాళ్లూ లేని పోరాటపటిమ హఠాత్తుగా ఎక్కడ్నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయారు.
మొత్తం మీద ఇంతకాలం ఏకపక్షంగా నడిచిన పార్లమెంట్.. ఇప్పుడు విపక్షాల మరో కోణం కూడా చూసింది. సభలో తాము చెప్పిందే నడుస్తుందనే అతివిశ్వాసంతో ఉన్న అధికారపక్షం.. అనుకోకుండా తిరగబడిన పరిస్థితుల్ని చూసి.. తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడింది. అంతేకాదు ఇంకా రెండున్నరేళ్ల పదవీకాలంలో పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలో కొత్త వ్యూహరచన చేయక తప్పని స్థితిలో పడింది. అంతేకాదు ఇకపై గతంలో మాదిరిగా పార్లమెంట్ అజెండాను ఏకపక్షంగా డిసైడ్ చేసే.. ఏ బిల్లైనా ఆమోదించుకోగలిగే పరిస్థితులు లేనట్టే. ఇకపై ప్రతి సెషన్‌కు ముందూ విపక్షాలతో సంప్రదింపులు తప్పక జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బిల్లు ఆమోదం కాదు కదా.. కనీసం ప్రవేశపెట్టాలన్నా ముందే విపక్షానికి సమాచారం ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. కాదూ కూడదని మొండిగా ముందుకెళ్తే భంగపాటు తప్పదనేది ఇప్పటికే తేలిన విషయం. అందుకే మళ్లీ మళ్లీ అవమానపడటానికి అధికార పక్షం ఇష్టపడటం లేదు. లేనిపోని ఇగోలకు పోయి బోర్లాపడే కంటే.. విపక్షాలతో సంప్రదింపులు జరిపి సావకాశంగా బిల్లుల ఆమోదమే గౌరవప్రదమనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.
అంతేకాదు మొన్నటిదాకా పార్లమెంట్‌లో అధికార పక్షం ఓవర్ డామినేషన్ చూసిన దేశ ప్రజలకు కూడా ఈ మాన్‌సూన్ సెషన్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. అదే సమయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కంటే వ్యూహాలు ఎలా ఆధిక్యతను తెచ్చిపెడతాయో కళ్లకు కట్టినట్టు చూపించింది. చాలాకాలం తర్వాత సభలో తక్కువ మంది ఎంపీల మాట నెగ్గింది. అధికార పక్షానికి ఎంతమంది ఎంపీలున్నా.. కీలకమైన నైతిక బలం లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పటానికి మాన్‌సూన్ సెషన్ తిరుగులేని ఉదాహరణ. మోడీ హయాంలో చెట్టుకో పుట్టగా చెదిరిన ప్రతిపక్షం.. గత బడ్జెట్ సెషన్లోనే ఏకతాటిపైకి వచ్చినా.. మాన్‌సూన్ సెషన్లో నైతిక బలాన్ని కూడా పెంచుకుని.. ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ఇకపై పార్లమెంట్‌లో తాము చెప్పిందే జరుగుతుందని ఇండియా కూటమి ఎంపీలు సగర్వంగా ప్రకటనలు చేస్తున్నారు. అపర చాణక్యుడ్ని తోక ముడిచేలా చేశామని గేలిచేస్తున్నారు. మొత్తం మీద పార్లమెంట్‌లో బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అయిన వైనం.. దేశ ప్రజలందరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది.