Reading Time: 2 minutes

తిరుమల: శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తి..43 రోజుల్లో 1,888 మందికి శిక్షణ

Caption of Image.

 తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక  విభాగం సహకారంతో  టీటీడీ  ప్రజా సంబంధాల శాఖ  43  రోజుల పాటు నిర్వహించిన‌ శిక్షణా కార్యక్రమం 2026 ఆగస్టు 12న  ముగిసింది.

2026 జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ రెండో విడత శిక్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన 1888 మంది శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. మొద‌టి బ్యాచ్ తో క‌లిపి ఇప్పటి వ‌ర‌కు దాదాపు 3 వేల మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు.

సమగ్ర శిక్షణ

వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీలోని వివిధ విభాగాల నిపుణులు, ఉపన్యాసకులు శ్రీవారి వైభవం, తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, పూజలు, కైంకర్యాల విశిష్టత, శ్రీవారి సేవ ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

సేవా కేంద్రాల్లో క్షేత్రస్థాయి శిక్షణ

శిక్షణలో భాగంగా లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ తదితర సేవా కేంద్రాలను శిక్షణార్థులు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సేవలు, సేవకుల బాధ్యతలు, వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

శిక్షణలో ప్రత్యేకతలు

ప్రతి బ్యాచ్‌లో సుమారు 200 మంది సేవకులకు శిక్షణ అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ కిట్, గ్రూప్ సూపర్‌వైజర్ ట్రైనింగ్ మాన్యువల్ అందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన గోవింద నామాలు, భగవద్గీత, శ్రీనివాస గాథ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా అందించారు.

తొలి విడతలో 1011 మందికి శిక్షణ

శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ తొలి విడత శిక్షణ 2025 డిసెంబర్‌లో ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7న ముగిసింది. మొత్తం 10 బ్యాచ్‌లలో సుమారు 1011 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు. తొలి ఏడు బ్యాచ్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సేవకులు, చివరి మూడు బ్యాచ్‌లలో తమిళనాడు, కర్ణాటకతో పాటు హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.