Reading Time: 2 minutes

రోజుకో సిగరెట్ తాగితే ఏం కాదులే.. అనుకుంటే పొరపాటే..న్యూరాలజిస్టులు ఏం చెబుతున్నారో తెలుసా?

Caption of Image.

సిగరెట్..యూత్ నుంచి ముసలివాళ్ల దాకా ఇదొక క్రేజీ హ్యాబిట్..మగవాళ్లే కాదు..ఈ మధ్య కాలంలో స్త్రీలు కూడా బగ్గఊదేస్తున్నారు. ఇక అక్కడక్కడ  మైనర్లు కూడా చాటుమాటుగా కాలుస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి.. కొందరు చైన్ స్మోకర్లు ఉంటారు..అంటే సిగరెట్ వెంట సిగరెట్ కాల్చేవారన్నమాట.. దీనిని తమ స్టేటస్ కు సింబాలిక్ గా చెప్పుకునేవారూ చాలామందే..సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. మానేయండి..అని డాక్టర్లు హెచ్చరించినా పొగలేకుండా లేకుండా ఉండలేం అనేటోళ్లు ఇంకొందరు. డాక్టర్ చెప్పాడు కదా  రోజుకు ఒకటే సిగరెట్ తాగుతున్నా అని  చెప్పుకునేటోళ్ళను మనం చూస్తుంటాం.. అయితే రోజుకో సిగరెట్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు ధూమపాన ప్రియుల్లో ఇదే బిగ్ క్వశ్చన్. రోజుకో సిగరెట్ పై న్యూరాలజిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. 

రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతున్నాం కదా.. పెద్దగా ప్రమాదం ఉండదని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా పడుకునే ముందు సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. కానీ న్యూరాజిస్టులు ఇది కూడా సురక్షితం కాదు. ఒక్క సిగరెట్ అయినా మెదడు, గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. 

సిగరెట్‌లోని నికోటిన్ బ్లడ్ ప్రెషర్, గుండె వేగాన్ని పెంచుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ధూమపానం రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీయడంతో పాటు రక్తం గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

పడుకునే ముందు తాగితే ప్రమాదం తగ్గదు. సిగరెట్ తాగే సమయం ఏదైనా.. శరీరం నికోటిన్, ఇతర విష పదార్థాలకు గురవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు డాక్టర్లు. 

పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే పొగతాగడం పూర్తిగా మానేయడం అత్యంత ముఖ్యమైన చర్య అంటున్నారు.  బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం, వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం అవసరమంటున్నారు. 

పొగతాగేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలంటున్నారు. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత, మాట తడబడటం, చూపు మందగించడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.  పక్షవాతం చికిత్సలో ప్రతి నిమిషం కీలకమే అని హెచ్చరిస్తున్నారు. 

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు ,సూచనలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వీటిని వృత్తిపరమైన వైద్య సలహాగా పరిగణించరాదు.

©️ VIL Media Pvt Ltd.