Reading Time: < 1 minute
Dragon Salaar 2 Prashanth Neel Jr Ntr Prabhas Shooting Update

Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ షూటింగ్‌కు దూరంగా ఉన్న సమయంలో సమయాన్ని వృథా చేయకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రత్యామ్నాయ ప్రణాళిక రెడీ చేసినట్లు టాక్. ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూనే.. మరోవైపు ప్రభాస్‌తో ‘సలార్-2’ షూటింగ్‌ను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ‘సలార్-2’కు సంబంధించి దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ డేట్స్ కేటాయిస్తే మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాత నెలలో 15 రోజులు ‘సలార్-2’, మరో 15 రోజులు ‘కల్కి 2’ కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇక ‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేకపోతే, ఈలోగా ఎన్టీఆర్ తన సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ షూటింగ్‌ను వేగవంతం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్‌పై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రశాంత్ నీల్ తన రెండు భారీ ప్రాజెక్టులను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.