
పోలీస్ డిపార్టుమెంట్ లో నలుగురు ఐపీఎస్ ల ప్రవర్తన బాలేదని వరంగల్ పర్యటన సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ నలుగురిలో ఒక అధికారిపై వేటు పడింది. 2026 ఆగస్టు 12న జోగులాంబ జోన్ డీఐజీ చౌహాన్ పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీఐజీ చౌహాన్ పై వేటు పడటంతో.. మరో ముగ్గురిపై కూడా వేటు పడనున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. అవినీతి ఆరోపణలతోనే ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
డీఐజీ చౌహాన్ పై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. విధి నిర్వహణలో తీవ్రమైన నోటి దురుసు, ఉన్నతాధికారులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తారని ఆయనపై విమర్శలున్నాయి. విజిట్ , ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేక ఆతిథ్యం కల్పించాల్సిందేనని, కనీసం ఆరు రకాల మాంసాహార వంటకాలు, బిర్యానీలతో ఖరీదైన విందులు ఏర్పాటు చేయాలనే వింత నిబంధనలతో కిందిస్థాయి సిబ్బందిని వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సైల బదిలీలు , పోస్టింగ్‌లలో నేరుగా జోక్యం చేసుకుంటూ పెద్ద మొత్తంలో వసూలు చేశారని, తన మాట వినే అనుకూలమైన వారికే ప్రాధాన్యమిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి.