
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రాష్ట్రానికి కరువు రావాలని, చివరికి చేతబడి పూజలు చేశారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. చేతబడి చేస్తే అది తిరగబడి మళ్లీ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్బంధం చేస్తుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక రోజుకు 18 గంటలు కష్టపడుతూ, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు కడుతున్నామని చెప్పారు.
కూకట్ పల్లిలో ఇందరమ్మ టవర్స్ కు శంకుస్థాపన చేసిన రేవంత్… గతంలో దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాగా వేసేవారని, కానీ తాము అధికారంలోకి రాగానే సన్నబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, మరియు మహిళా సంఘాలకు 65 వేల కోట్ల రుణాలు అందించామని సీఎం గుర్తుచేశారు.రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని సవాల్ విసిరిన సీఎం.. ఇప్పుడు తాము క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్లు, పేదల కోసం అద్భుతమైన ఎల్‌ఐజీ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన అభినందించారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు నిద్రపోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ భూమి మీకు ఇప్పిస్తానని సీఎం హామీ ఇచ్చారు.