Reading Time: < 1 minute
Washington Sundar Likely Out Of 2nd Sri Lanka Test Team India Injury Update

Washington Sundar Out: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు వరుస గాయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దీంతో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్‌ను అదనపు ఆటగాడిగా బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కొలంబోలో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టుతో కలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒకవేళ పూర్తిగా కోలుకున్నా.. గాయం తర్వాత ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో వెంటనే టెస్ట్ మ్యాచ్‌లో ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయదు.

ఇంగ్లండ్‌ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడి వర్క్‌లోడ్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉండటంతో.. సుందర్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ మెడికల్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. సుందర్‌ను రెండో టెస్టు కోసం ఎంపిక చేసినప్పటికీ అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడం అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఫిట్‌నెస్‌పై వచ్చే వారం మరోసారి పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సుందర్ శ్రీలంకకు వెళ్లలేకపోతే.. అతడి స్థానంలో కొత్త ఆటగాడిని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంటుంది.

ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్ కూడా కాలికి గాయం కావడంతో జట్టుకు అందుబాటులో లేడు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా దూరమైతే.. సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది ఎదురుదెబ్బ అవుతుంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా, ఆకాశ్ దీప్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరి పునరాగమనానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. వరుసగా కీలక ఆటగాళ్లు గాయపడుతుండటంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెరుగుతోంది.