Reading Time: 2 minutes

రూ.500 కోసం ఆశపడి 3 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి.. ఈ కొత్త స్కామ్ గురించి తెలుసా?

Caption of Image.

గోవాలోని పొండాకు చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల వలలో పడి ఏకంగా రూ.3.లక్షల 9వేలు నష్టపోయాడు. సైబర్ నేరగాడు బ్యాంక్ ఉద్యోగినంటూ ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డుపై క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన రివార్డ్ పాయింట్లను క్యాష్ గా మార్చి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని నమ్మించాడు. అతడి మాటలను నిజమే అనుకున్న బాధితుడు మోసగాడు సూచించిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడ తన క్రెడిట్ కార్డు వివరాలు, పర్సనల్ డీటైల్స్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.3లక్షల 9వేల 020 డెబిట్ కావడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ ఘటన ఆగస్టు 3న మధ్యాహ్నం 3.07 గంటల నుంచి 3.44 గంటల మధ్య జరిగినట్లు బాధితుడు రాజు ఫడ్తే ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తెలుస్తోంది. 

ఇలాంటి నయా మోసాలు క్రెడిట్ కార్డు వినియోగదారులను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. గోవాలోని మర్డోల్ పోలీస్ పరిధిలోనే గతంలోనూ ఇదే తరహాలో రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేయిస్తామని చెప్పి ఓ వ్యక్తిని నకిలీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్లిన ఘటన నమోదైంది. ఆ కేసులో బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్షా 80వేలు దోచేశారు నేరగాళ్లు. దీంతో రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, కార్డు అప్‌డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, లింకుల విషయంలో జాగ్రత్త అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజీలు వస్తే వాటికి స్పందించకుండా మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని సంప్రదించటం లేదా దగ్గరలోని బ్యాంక్ శాఖకు వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. 

ప్రస్తుతం పొండా కేసుపై మర్డోల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన PSI నితేష్ కాంకోంకర్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన ఫోన్ నంబర్, బాధితుడికి పంపిన వెబ్‌సైట్, జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. బ్యాంక్ ఉద్యోగులమని చెప్పే వ్యక్తులకు ఫోన్‌లో క్రెడిట్ కార్డు నంబర్, CVV, OTP, PIN వంటి సున్నితమైన వివరాలను ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవాలన్నా, కార్డు సంబంధిత సమాచారం తెలుసుకోవాలన్నా బ్యాంక్ అధికారిక యాప్, వెబ్‌సైట్ లేదా అధికారిక కస్టమర్ కేర్ ద్వారా మాత్రమే వివరాలను ధృవీకరించుకోవడం సురక్షితమైన మార్గం.

©️ VIL Media Pvt Ltd.