Reading Time: 2 minutes
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది?

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎప్పుడూ ఎదురయ్యే ప్రధాన సందేహం… ప్లాట్ కొనాలా లేక ఫ్లాట్ కొనాలా? రెండు ఆప్షన్లకు వాటి స్వంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. సాధారణంగా భూమికి పరిమిత లభ్యత ఉండటం వల్ల పలాట్‌ విలువ సమయం గడిచేకొద్దీ వేగంగా పెరుగుతుంది. ఎక్కువ రాబడిని ఇస్తుంది. మరోవైపు, ఫ్లాట్లలో వెంటనే నివసించడానికి లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన అద్దె ఆదాయం పొందే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడిదారుడి లక్ష్యాలు, బడ్జెట్, అవసరాలను బట్టి సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం.

క్యాపిటల్ అప్రిషియేషన్..

ప్లాట్: ఓపెన్ ప్లాట్ల విలువ చాలా వేగంగా పెరుగుతుంది. భూమికి పరిమిత లభ్యత ఉండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్లాట్ కొంటే దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో రాబడి లభిస్తుంది.

ఫ్లాట్: ఫ్లాట్ విలువ కూడా పెరుగుతుంది. కానీ, భవనం పాతబడే కొద్దీ దానికి తరుగుదల వర్తిస్తుంది. కాబట్టి, ప్లాట్‌తో పోలిస్తే ఫ్లాట్ విలువ పెరుగుదల కాస్త నెమ్మదిగా ఉంటుంది.

అద్దె ఆదాయం:

ప్లాట్: ఖాళీ ప్లాట్ ద్వారా తక్షణమే క్రమం తప్పకుండా అద్దె రాబడి పొందడం కష్టం.

ఫ్లాట్: ఫ్లాట్ కొనుగోలు చేసిన వెంటనే అద్దెకు ఇచ్చి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఐటీ హబ్‌లు, కళాశాలలు, వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఉంటుంది.

నిర్మాణం, నిర్వహణ:

ప్లాట్: ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత మన బడ్జెట్, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఇల్లు నిర్మించుకోవచ్చు. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.

ఫ్లాట్: ఫ్లాట్ నిర్మాణం, డిజైన్ బిల్డర్ చేతిలో ఉంటుంది. అంతేకాకుండా సెక్యూరిటీ, లిఫ్ట్, పార్కింగ్ వంటి సదుపాయాల కోసం ప్రతి నెలా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ రుణాలు, పన్ను ప్రయోజనాలు:

సాధారణంగా ప్లాట్ కొనుగోలు కంటే ఫ్లాట్ కొనుగోలుకు హోమ్ లోన్ పొందే ప్రక్రియ వేగంగా, సులభంగా ఉంటుంది. హోమ్ లోన్ అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి.

మీ లక్ష్యం దీర్ఘకాలంలో భారీ రాబడి పొందడం అయితే ప్లాట్ ఎంచుకోవడం ఉత్తమ మార్గం. ఒకవేళ మీకు ప్రతి నెలా స్థిరమైన అద్దె ఆదాయం కావాలనుకుంటే ఫ్లాట్‌లో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..