Reading Time: 2 minutes

మధ్యవర్తి చెప్పినట్లు విడాకులకు అంగీకరించాక యూటర్న్ తీసుకోవటం కుదరదు: సుప్రీం కోర్టు

Caption of Image.

పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని ఒప్పందం చేసుకున్న తర్వాత.. ఆ నిర్ణయం నుండి యూటర్న్ తీసుకోవటం కుదరదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాదాల పరిష్కారంలో భాగంగా కుదుర్చుకున్న సెటిల్‌మెంట్ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టప్రకారం విడాకుల డిగ్రీ రాకముందే సమ్మతిని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. దానిని సెటిల్‌మెంట్ ఒప్పందంలో అంగీకరించిన బాధ్యతల నుంచి తప్పించుకోవటం కోసం ఉపయోగించకూడదని కోర్టు తేల్చి చెప్పింది. మధ్యవర్తిత్వం  ద్వారా కుదిరిన ఒప్పందాలను గౌరవించకపోతే మీడియేషన్ ప్రక్రియ పునాదులే దెబ్బతింటాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

ఒకసారి మధ్యవర్తి సమక్షంలో అన్ని వివాదాలను పరిష్కరించుకుంటూ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన తర్వాత.. దాని నుండి ఎవరైనా వెనక్కి తగ్గితే వారిపై భారీ జరిమానాలు విధించాలని కోర్టు పేర్కొంది. కేవలం మోసం, ఒత్తిడి, లేదా అవతలి పక్షం అగ్రిమెంట్ రూల్స్ పాటించడంలో విఫలమైనప్పుడు మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు లేని పక్షంలో.. మధ్యవర్తిత్వంలో చేసిన వాగ్దానాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి అనాలోచిత నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదని కోర్టు హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం కొంత ప్రయోజనం పొందిన తర్వాత మాట మార్చడం చట్టప్రకారం చెల్లదని పేర్కొంది.

►ALSO READ | తెలంగాణ ఏర్పాటును.. పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య

ప్రస్తుత కేసులో 20 ఏళ్లకు పైగా కాపురం చేసిన దంపతులు 2022-23లో విడిపోయారు. మధ్యవర్తిత్వం ద్వారా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని.. మొదటి విడత విడాకుల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే రెండో విడత సమయానికి భార్య తన సమ్మతిని ఉపసంహరించుకోవడమే కాకుండా.. భర్తపై గృహ హింస కేసు పెట్టింది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రెండు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ లేని ఆరోపణలు, సెటిల్‌మెంట్ తర్వాత అకస్మాత్తుగా రావడం చూస్తుంటే ఇది ముందస్తు ప్లాన్ తో, పగతో చేసిన పనిగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు చట్టాలను దుర్వినియోగం చేయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.

చివరగా ఆ దంపతుల వివాహ బంధం పూర్తిగా దెబ్బతిందని, వారు తిరిగి కలిసే అవకాశం లేదని కోర్టు నిర్ధారించింది. అందుకే ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్ ప్రాతిపదికన ఆ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భార్య దాఖలు చేసిన గృహ హింస కేసును కొట్టివేస్తూ.. గతంలో కుదుర్చుకున్న సెటిల్‌మెంట్ ఒప్పందంలోని మిగిలిన నిబంధనలను ఇరువురూ పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా మధ్యవర్తిత్వ ఒప్పందాలకు ఉన్న చట్టబద్ధమైన బలాన్ని సుప్రీంకోర్టు మరోసారి హైలైట్ చేసింది. విడాకుల విషయంలో ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక.. స్వార్థ ప్రయోజనాల కోసం మాట తప్పడం ఇకపై సాధ్యం కాదని తాజా తీర్పు స్పష్టం చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.