Reading Time: 2 minutes
Off The Record Over Tdp Vs Ycp 2

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైసీపీ అటెండ్‌ అయ్యే అవకాశం ఉందా? డీఎస్సీ ఎపిసోడ్‌ హాట్‌హాట్‌గా నడుస్తున్నందున నిర్ణయం మారే అవకాశం ఉంటుందా? కూటమి సభ్యులందరికీ అధికార పక్షం అలర్ట్‌ వార్నింగ్‌ ఇవ్వడం వెనకున్న ఉద్దేశ్యే ఏంటి? వైసీపీ వచ్చినా, రాకున్నా అంటూ చర్చలు ఎందుకు మొదలయ్యాయి? బీసీల విషయంలో ఈసారి తీసుకోబోతున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటి? లెట్స్‌ వాచ్‌. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నాలుగు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. సాధారణంగా అసెంబ్లీ సెషన్‌ అనగానే… ఏం జరుగుతోంది? ఏయే అంశాల ప్రస్తావన వస్తుంది? కీలకమైన ప్రకటనలు ఏవైనా ఉంటాయా అంటూ… ప్రజల ఫోకస్‌ ఇటువైపు మళ్ళుతుంది. వివిధ సమస్యల మీద ప్రభుత్వం ఏం చెబుతోందన్న అనేక విషయాలతో పాటు సభలో జరిగే చర్చను సీరియస్‌గా గమనిస్తూనే ఉంటారు. అయితే… ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక అధికార పక్షం తప్ప ప్రతిపక్షం సభలో లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళకూడదన్న వైసీపీ నిర్ణయంతో గడిచిన రెండేళ్లుగా వార్‌ వన్‌సైడే అన్నట్టు నడుస్తోంది వ్యవహారం. అదంతా ఒక ఎత్తయితే… క్రమంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. సభకు వెళ్ళకున్నా…వివిధ అంశాల మీద ప్రభుత్వాన్ని వివిధ ఆందోళన రూపంలో నిలదీస్తోంది వైసీపీ. మరీ ముఖ్యంగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో హోరెత్తిస్తోంది విపక్షం. దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. అదే సమయంలో డీఎస్సీ విషయంలో ప్రభుత్వం కూడా క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇక తాము చెప్పాలనుకున్నదేదో అందరికీ తెలిసేలా, సభాముఖంగానే చెప్పాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. దాంతోపాటు గత రెండేళ్ళలో ఏం చేశాం…రాబోయే మూడేళ్ళలో ఏం చేస్తామన్న విషయాన్ని క్లియర్‌గా, సూటిగా… సుత్తిలేకుండా చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

అలాగే… ఈసారి ఆరు కీలకమైన అంశాలకు సంబంధించి డిటైల్డ్‌ డిస్కషన్‌ చేయబోతున్నట్టు సమాచారం. వీటిలో అత్యంత కీలకమైనది బీసీ రిజర్వేషన్‌ బిల్లు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ పెంపునకు సంబంధించిన బిల్లును ఈ సెషన్‌లోనే ప్రవేశపెట్టబోతున్నారట. దీనిని హై ప్రయారిటీగా చెబుతున్నాయి కూటమి వర్గాలు. అందుకే తమ సభ్యులు ఎవ్వరూ డుమ్మా కొట్టకుండా చర్చలో భాగస్వాములు అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచే క్రమంలో ఈ బిల్లు అత్యంత కీలకమైనదని, ఎంతో కసరత్తు తర్వాత బిల్లు ప్రవేశ పెడుతున్నందున సభ్యులంతా అలర్ట్‌గా ఉండి, చర్చలో పాల్గొనాలని సూచిస్తున్నారట కూటమి పెద్దలు. ఇలాంటి సందర్భంలో వైసీపీ కూడా సభకు వస్తే మంచిదని, వాళ్ళు వచ్చినా, రాకున్నా… సంబంధం లేదు, మనం మాత్రం బాధ్యతాయుతంగా చర్చలో పాల్గొనాలని టీడీపీ సభ్యులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది.

ప్రతిపక్షం సభలో లేకున్నా… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలు.. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, శాంతి భద్రతలు.. ఇలా అన్ని అంశాలను టచ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ అనూహ్యంగా వైసీపీ సభకు హాజరై..కొన్ని అంశాలను ప్రస్తావించినా…. దీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాలన్న ఆదేశాలు కూటమి నేతలకు వెళ్ళాయట. వైసీపీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ వ్యతిరేక ఆందోళనలు నిర్వహిస్తున్నందున అసెంబ్లీలో ఈ అంశాన్ని తప్పకుండా ప్రస్తావించి క్లారిటీ ఇవ్వాలనుకుంటోందట అధికార పక్షం. అటు శాసన మండలికి వైసీపీ అటెండ్‌ అవుతున్నందున అక్కడ కచ్చితంగా డీఎస్సీ రచ్చ ఉంటుందన్న ఉద్దేశ్యంతో కూటమి ఎమ్మెల్సీలను అలర్ట్‌ చేశారన్నది ఇంటర్నల్‌ టాక్‌. మొత్తం మీద అసెంబ్లీకి ప్రతిపక్షం అటెండ్‌ అయినా, కాకున్నా… అలర్ట్‌గా ఉండేందుకు కూటమి రెడీ అవుతున్నట్టు సమాచారం.