
కార్పోరేట్ రుణాలు అంటే తెలిసే ఉంటుంది. పెద్దపెద్ద ప్రైవేటు కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు. గత పన్నెండేళ్లలో బ్యాంకులు మాఫీ చేసిన కార్పోరేట్ రుణాలు 9 లక్షల 95 వేల కోట్ల రూపాయలు. అంటే దాదాపు పది లక్షల కోట్లు. కార్పోరేట్ లోన్స్ రైట్ ఆఫ్ లెక్కలు కేంద్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 10న పార్లమెంటుకు తెలిపింది.
కార్పోరేట్ రుణాలు మాఫీపై మాట్లాడుతూ.. పూర్తిగా రద్దు చేసనట్లు కాదని.. రికవరీ కొనసాగుతుందని పేర్కొంది. 2018-19లో అత్యధికంగా లక్షా 48 వేల 753 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 20 వేల 485 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ రాతపూర్వకంగా పార్లమెంటుకు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. పెద్ద పరిశ్రమలకు ఔట్ స్టాండింగ్ లోన్లు 2025 ఆర్థిక సంవత్సరానికి 63 లక్షల19 వేల 57 కోట్ల రూపాయలు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరానికి 69 లక్షల 21 వేల 734 కోట్ల రూపాయలకు పెరిగినట్లు తెలిపారు. మాఫీ అనేది అకౌంటింగ్ ప్రొసీజర్ మాత్రమేనని.. రుణ గ్రహీత కంపెనీలకు అది ఎలాంటి ఉపశమనం కాదని పేర్కొన్నారు.
కార్పోరేట్ లోన్ల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వస్తూనే ఉన్నాయి. మోదీ పగ్గాలు చేపట్టాక కార్పోరేట్ రుణాల మాఫీ ఎక్కువగా ఉందని పలు మార్లు ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం గమనార్హం. సామాన్యుల లోన్ల విషయంలో ముక్కు పిండి వసూళ్లు చేసే బ్యాంకులు.. కార్పోరేట్ల విషయంలో ఎందుకు ఉదాసీనత వహిస్తున్నాయనే ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.