
కాస్ట్లీ వాచీలను ఇష్టపడే వారి కోసం ఒక అద్భుతమైన వార్త.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ వాచ్ కంపెనీ ‘ఆడిమర్స్ పిగెట్’ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన వాచ్‌ను రూపొందించింది. ఈ వాచ్ పేరు రాయల్ ఓక్ “Indian Sanskrit’ 15409OR. దీని ధర సుమారు రూ.3 కోట్లు. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో సమయాన్ని తెలిపే అంకెలు మన పురాతన భాష అయిన సంస్కృతంలో ఉంటాయి.
ఈ వాచ్ డయల్ ముదురు ఆకుపచ్చ రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిపై బంగారు రంగులో మెరిసిపోయే సంస్కృత అంకెలు భారతీయ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. ఈ వాచ్ మొత్తం 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో ఉంటుంది. దీని బెజెల్ అష్టభుజి ఆకారంలో ఉండి, ఆడిమర్స్ పిగెట్ బ్రాండ్ క్లాసిక్ లుక్‌ను అందిస్తుంది.
►ALSO READ | అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్ : లోన్ ఖాతాలు ‘ఫ్రాడ్’ కింద వర్గీకరణపై నో రిలీఫ్..
వాచ్‌లోని సెకన్ల ముల్లుకు నారింజ రంగును ఉపయోగించారు. ఇది వాచ్‌కు ఒక మోడ్రన్ లుక్‌ను ఇచ్చింది. అలాగే తేదీని చూసుకోవడానికి ఒక చిన్న విండో కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి గడియారాల తయారీ సంస్థ, భారతీయ భాషకు ఇంతటి గౌరవం ఇవ్వడం గడియారాల ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎందుకు వైరల్
నిజానికి ఈ మోడల్ కొంతకాలం క్రితమే విడుదలైనప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని ఫోటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. విదేశీ కంపెనీలు భారతీయ సంస్కృతిని, కళలను వాటి ఉత్పత్తులలో ఎలా ఉపయోగిస్తున్నాయనే అంశంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సాంకేతిక నైపుణ్యం, సాంస్కృతిక అందం కలగలిసిన ఈ వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.