Reading Time: < 1 minute

‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను

విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి

సర్టిఫికెట్‌ను ప్రదానం చేసిన హార్వర్డ్ అధ్యాపకులు

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దిక్కింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో అంతర్జాతీయ స్థాయి నాయకత్వ శిక్షణకు ప్రతీకగా నిలిచే ‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను సిఎం రేవంత్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సిఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఫ్యాకల్టీయే స్వయంగా సర్టిఫికెట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారంలో ఉండగానే ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ సిఎంగా ఆయన రికార్డు సృష్టించారు. నాయకత్వం అంటే మాటల్లో కాదు, పనిలో చూపించాలన్న దృక్పథంతో ప్రతి సెషన్‌లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

గడ్డకట్టే చలిలోనూ అభ్యాసం..

ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో సిఎం ఒక సామాన్య విద్యార్థిలా గడిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మసాచుసెట్స్లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల నుంచి -24కు పడిపోయాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిఎం రేవంత్ ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు.

21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కొవాలన్న అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన ఈ శిక్షణ పొందారు. ప్రపంచవేదికపై తెలంగాణ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, పాలనలో కొత్త ఆలోచనలు, అంతర్జాతీయ అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.