
పథకం ప్రకారమే నల్లమలసాగర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు
రేవంత్‌రెడ్డి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నారు
బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. పథకం ప్రకారమే పోలవరం- నల్లమలసాగర్‌కు తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి రిట్‌ను ఉపసంహరించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
తొలి నుంచి కూడా గోదావరి నదీ జలాల అక్రమ తరలింపుపై బిఆర్‌ఎస్ అప్రమత్తం చేస్తూనే ఉందని…అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నా… కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పులు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రాష్ట్ర నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నది పేరుకే జలవివాదాల కమిటీ సమావేశం అని, పోలవరం -నల్లమలసాగర్‌కు పరిష్కారం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని హరీష్‌రావు అన్నారు. 200 టిఎంసిల గోదావరి జలాలను ఎపి తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.తాను ప్రశ్నించిన తర్వాత వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఎపి ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఎపి నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారని చెప్పారు. రెండు షరతులు పెట్టి ఢిల్లీలో సమావేశానికి వెళ్లారని, ఎపి ప్రభుత్వం నల్లమలసాగర్‌కు డిపిఆర్ ఆపాలని, ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొద్దని రెండు షరతులు విధించిందని పేర్కొన్నారు. వీటికి కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
నల్లమలసాగర్‌కు అంగీకరించి తెలంగాణకు మరణశాసనం రాయాలని అనుకుంటున్నారా..? అని నిలదీశారు. ఈ సమావేశానికి కూడా ఆదిత్యనాథ్‌దాసునే పంపించారని, ఆయన గతంలో ఎపి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు ఈ సమావేశానికి ఆయన ఎలా నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. నికార్సయిన తెలంగాణ ఇంజనీర్ దొరకలేదా అంటూ ధ్వజమెత్తారు. మన ప్రాజెక్టులకు అడ్డుపడిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం తరఫున వాదనలకు వెళ్లారని అన్నారు.
కెసిఆర్ ప్రభుత్వం గోదావరిపై 7 ప్రాజెక్టులకు డిపిఆర్‌లను పంపించిందని తెలిపారు. బిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అని, అవసరమైతే కెసిఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఢిల్లీలో జరుగుతున్న సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించాలని, కాదని పాల్గొంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. తెలంగాణ నీళ్లు ఎపికి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సీడబ్ల్యూసీ సమావేశాన్ని బహిష్కరించాలి
సీడబ్ల్యూసీ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్లను ఆపితేనే ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారని.. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని, ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం జరగబోతోందని ఆరోపించారు.
కెసిఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది
కెసిఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసిందని హరీస్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించిందని, రెండు కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణిగా మారిందని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్బుతమైన ఆయకట్టు వచ్చిందని, కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని, 32 లక్షల ఎకరాల ఆయకట్టు బిఆర్‌ఎస్ సాధించిందని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న దోపిడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచిందని, వాళ్లు కళ్లు తెరవండి అనవసరంగా బిఆర్‌ఎస్ మీద నోళ్లు పారేసుకోవద్దని సూచించారు.తాము తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంత్‌రెడ్డి ఎపికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. నీటిని ఒడిసి పట్టింది కెసిఆర్ విడిచి పెట్టింది రేవంత్ అని, బిఆర్‌ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి, దావోస్‌కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదని హరీష్‌రావు విమర్శించారు.