
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీణవంక గ్రామానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతేకాక.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐపిఎస్ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని అన్నారు. సిఎం ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని తెలిపారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తుండగా.. అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని.. ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని పేర్కొన్నారు.