
అమరావతి: తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సిట్ పూర్తి నివేదిక ఇస్తే వైసిపి నేతలకు గుండె పోటు రావడం ఖాయమని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఐదు కొండలంటూ గతంలో తిరుమల భక్తులను మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. తిరుమలపై మాజీ సిఎం జగన్, ఆయన బ్యాచ్ ఎందుకు కక్ష కట్టిందో చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఖాళీ మధ్యం బాటిళ్లు తిరుమలలో పెట్టి దొరికిపోయారని, కల్తీ నెయ్యితోనే తిరుమల లడ్డూ తయారు చేసిందని సిట్ గుర్తించిందన్నారు. ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిది అని చురకలంటించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆలయానికి వెళ్లటం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడటం, గుడికి వెళ్లకుండా సెట్టింగ్‌లు వేసుకోవడం అలవాటుగా మారిందని సుభాష్ ధ్వజమెత్తారు.