
హైదరాబాద్: తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాలపై తాము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందని, బనకచర్ల ప్రాజెక్టు పేరు మారినా తెలంగాణకు ద్రోహం మారలేదని విమర్శించారు. ప్లాన్ ప్రకారమే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని, ఢిల్లీలో జరిగేది.. పేరుకే జలవివాదాల మీటింగ్ అని.. కత్తి ఎపి చంద్రబాబుది.. పొడుస్తున్నది సిఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
నల్లమల సాగర్ పూర్తయ్యాక సుప్రీంకోర్టుకు వెళ్లారని, కేసు వేయమంటే చెల్లని రిట్ వేసి వాపస్ తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నీళ్లను నల్లమల సాగర్ కు తరలించడమే ప్రధాన ఉద్దేశమని, ఎపి ప్రభుత్వం ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ పెట్టారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. నల్లమల సాగర్ డిపిఆర్ ప్రక్రియను ఆపాలని ఒక కండిషన్ పెట్టారని, ఈ రెండు కండిషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్ కు వస్తారని లేఖ రాశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు ధారాదత్తం చేయడం కోసం కాదని హరీష్ రావు ధ్వజమెత్తారు.