
అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజీ
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి లేదంటే బ్యారేజీ భద్రతకే ముప్పు
లోక్‌సభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని, దానికి మరమ్మతులు, నివారణ చర్యలు చేపట్టకపోతే బ్యారేజీ భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ డ్యామ్‌ను అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న జాబితాలో చేర్చామని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్రం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మేడిగడ్డను కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్‌గా గుర్తించింది. 2025 పోస్ట్-మాన్సూన్ (వర్షాకాలం తర్వాత) తనిఖీల్లో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ ను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) కేటగిరి-1గా వర్గీకరించింది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్‌డిఎస్‌ఏ సూచించిన నివారణ, రక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి జల్‌శక్తి శాఖ సూచించింది.
గురువారం లోక్‌సభలో దేశవ్యాప్తంగా డ్యామ్‌ల సేఫ్టీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి సభకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో ఈ విషయం బహిర్గతమయ్యింది. దీంతోపాటు దేశంలో 50 ఏళ్లు దాటిన 1,681 డ్యామ్‌లు ఉన్నాయని రాజూషణ్ చౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు.
50 ఏళ్లు దాటిన డ్యామ్‌లు 1,681
దేశవ్యాప్తంగా కేటగిరీ-1లో గుర్తించిన మూడు డ్యామ్‌ల్లో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి కాగా, మిగతావి ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్‌లోని బోకారో బ్యారేజులు ఉన్నాయని కేంద్రమంత్రి తన సమాధానాల్లో స్పష్టం చేశారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్- 2021 ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు, తర్వాత తనిఖీలు తప్పనిసరి అని ఆయన తెలిపారు. 2025లో దేశవ్యాప్తంగా ప్రీ- మాన్సూన్ (వర్షాకాలానికి ముందు) 6,524 డ్యామ్‌లు పోస్ట్-మాన్సూన్ (వర్షాకాలం తర్వాత) 6,553 డ్యామ్‌ల తనిఖీలు చేపట్టినట్లు ఆయన ఇచ్చిన సమాధానాల్లో తెలిపారు. ఈ తనిఖీల్లో మూడు డ్యామ్‌ల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు డ్యామ్‌ల్లో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్, ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్‌లోని బోకారో బ్యారేజులు ఉన్నాయని, అధికారుల పరిశీలనల ఆధారంగా డ్యామ్‌లను మరమ్మతుల అత్యవసరతను బట్టి వర్గీకరణ చేశామని కేంద్రమంత్రి తెలిపారు.
బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లుగా…..
మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థ ప్రధాన కారణమని పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గతంలో తేల్చింది. ముఖ్యంగా సీకెంట్ పైల్స్ వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాంను తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహాంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్లు పిసి ఘోష్ కమిషన్ గుర్తించింది. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని, రూ.4,613 కోట్లకు అంచనాలను సవరించి, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు ఆ సంస్థ ధ్రువీకరణ పత్రం కోరిందని పిసి ఘోష్ కమిషన్ తెలిపింది.
2024 మార్చి 2వ తేదీన ఆరుగురితో కమిటీ
2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. సంవత్సరాలు పూర్తవుతున్నా, బ్యారేజీ మరమ్మతులు, పునరుద్ధరణ అంతుచిక్కని అంశంగా మారింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డిఎస్‌ఏ) నిపుణుల కమిటీ హెచ్చరించింది.
దాంతో ఈ బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ 2024 ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాయగా 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 8 బ్లాకులుగా కట్టగా ఒక్కో బ్లాకులో 10-11 దాకా పియర్లు ఉన్నాయి. బ్యారేజీకి మొత్తం 85 పియర్లు ఉండగా ఏ ఒక్క పియర్లో సమస్యలు తలెత్తినా, ఆ బ్లాకులోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.