Reading Time: 2 minutes

వనం వీడి జనంలోకి…. ఉదయం నుంచే గుట్టపై పూజలు

గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతించిన ఎస్పీ

పాల్గొన్న మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి

దారి పొడవునా లక్షలాదిగా భక్తజనం

శివసత్తుల పూనకాలతో మార్మోగిన మేడారం

(వల్లాల వెంకటరమణ)

మనతెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం.. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరింది. ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా పూజారులు గురువారం రాత్రి చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్టించారు. దీంతో మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం మొదలై జాతర పతాకస్థాయికి చేరింది. అశేష భక్త జనం జయజయధ్వానాలు, కేరింతల నడుమ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేనన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా తల్లిని స్వాగతించారు. ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క రూపమైన కుంకుమ భరిణెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి కిష్టయ్య ఒక్కరే గుట్టపైకి వెళ్లి పూజచేశారు.

పూజ పూర్తయిన తర్వాత తల్లి స్వరూపాన్ని తీసుకుని కిందకు వస్తున్న సంకేతం చేరవేయడంతో ఎస్పీ కేనన్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రధాన పూజారి కిష్టయ్యతోపాటుగా మిగతా పూజారులు తల్లిని తీసుకుని గుట్ట దిగగానే మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర స్వాగతం పలికారు. ఈ అధ్బుత ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భక్తులు ఒక్కసారిగా కేరింతలు కొట్టడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుట్టపైనుంచి సమ్మక్కను తీసుకవస్తుండగా ఆదివాసీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. డోలు వాయి ద్యాలతో నృత్యాలు, ఆటా, పాటలతో భక్తజన పారవశ్యంతో మేడారం పరిసరాలన్నీ ఉప్పొంగిపోయాయి.

లక్షలాది భక్తులు వెంటరాగా పూజారులు సమ్మక్క తల్లిని గుట్టనుంచి గద్దెపైకి తీసుకువచ్చారు. దారిపొడవునా భక్తులు మంగళ హారతులు పట్టారు. కోళ్లు, మేకలు, గొర్రెలు బలిచ్చారు. సమ్మక్క తల్లి వచ్చే మార్గమంతా రక్తంతో తడిచిపోయింది. దారికి ఇరువైపులా భక్తులు గుమిగూడి అమ్మవారికి దందాలు పెట్టుకున్నారు. పూజారులను తాకి తన్మయత్వం చెందేందుకుయత్నించారు. శివసత్తుల పూనకాలు, భక్తి పారవశ్యంతో ఊగిపోయే భక్తులను నియంత్రించేందుకు పోలీసులు తంటాలుపడ్డారు. ఐదంచెల భద్రత ఏర్పాటుచేసి రోప్ పార్టీలతో పూజారుల బృందానికి పోలీసులు రక్షణ వలయంగా నిలిచి ముందుకుసాగారు.

ఉద్విగ్నం… ఉద్వేగం… తల్లి ఆగమనం

చిలుకల గుట్టనుంచి సమ్మక్క తల్లి ఆగమనం ఉద్విగ్నo, ఉద్వేగంగా మారింది. సమ్మక్క తల్లి రాక కోసం ఎదురుచూస్తున్న జనమంతా ఒక్కసారిగా కేరింతలు, జయజయ ధ్వానాలతో తల్లిని స్వాగతించడంతో భక్తి పారవశ్యం తారాస్థాయికి చేరింది. సమ్మక్క వస్తున్న దారిలో శివసత్తులకు పట్టపగ్గాలూ లేకుండాపోయాయి. తల్లికి స్వాగతం పలికేందుకు ఎదురుచూసే వారిలో మొదటి వరుసలో ఉండే శివసత్తులు ఎదురెళ్లి ప్రణమిల్లి మొక్కుకుంటారు. వీరిని నియంత్రిస్తూ పోలీసులు పూజారులకు రక్షణగా ఉంటూ తల్లిని గద్దెపైకి తీసుకొచ్చారు. భక్తి పారవశ్యంతో ఊగిపోయిన భక్తులు మేడారంలో గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకోవడంతో జాతర ప్రాంగణం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారింది. లైట్లు ఆర్పేసి గద్దెపైకి అమ్మవారిని తెచ్చారు.

అప్పటికే క్యూ లైన్లలో లక్షలాదిగా వేచివున్న భక్తులు దర్శనం కోసం దూసుకొచ్చారు. రెండేళ్లకోసారి వచ్చే జాతరలో తమ కోర్కెలు తీర్చాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం మేడారం జాతరను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్, పిసిసి చీఫ్ మహేశ్, ఉన్నతాధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయంనుంచే చిలుకల గుట్టలో….సమ్మక్క తల్లి కొలువై ఉన్న చిలుకలగుట్ట వద్ద ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క గుడిని శుద్ధి చేసి మామిడి తోరణాలను అలంకరించారు. శక్తి పీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేశారు.

పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, ఆడేరాలు తెచ్చి గద్దెపై ప్రతిష్టించారు. పసుపు, కుంకుమలతో అలంకరించారు. సమ్మక్క తల్లికి పూజలు నిర్వహించే ముందు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వెదురు వనానికి పూజలు నిర్వహించి వెదురును గద్దెపైన ప్రతిష్టించారు. నియమ, నిష్ఠలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఒక్కరోజే 80 లక్షల మంది దర్శనంమేడారంలో గురువారం ఒక్కరోజే తల్లులను 80 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోకముందే పెద్దఎత్తున దర్శనాలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే లక్షలాదిగా మేడారం పరిసరాల్లో తిష్టవేసిన భక్తులు మాత్రం సమ్మక్క తల్లి ఆగమనం తర్వాత దర్శనం చేసుకునేందుకు ఎగబడ్డారు.