Reading Time: 3 minutes

హైదరాబాద్ నందినగర్‌లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆయన పిఎకు అందించిన

సిట్ అధికారులు

నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం

65 ఏళ్ల వయసు దృష్టా ఇంటివద్దనే విచారణకు వెసులుబాటు

స్వచ్ఛందంగా రావాలనుకుంటే జూబ్లీహిల్స్ ఠాణాకు

రావొచ్చు లేదంటే హైదరాబాద్ పరిధిలో ఆయన కోరిన చోట విచారణ

నోటీసుల్లో పేర్కొన్న సిట్ అధికారులు

ఇది కక్ష సాధింపు: కెటిఆర్

కెసిఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే: హరీశ్

భగ్గుమన్న బిఆర్‌ఎస్ శ్రేణులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు ఇచ్చారు. గురువారం నందినగర్‌లోని కెసిఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి ఆయన పి.ఎకు నోటీసులు అందజేశారు. అందులో ప్రధానంగా సిఆర్‌పిసి 160 సెక్షన్ కింద పలు అంశాలను పొందుపరిచారు. శుక్రవారం(జనవరి 30) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. 65 ఏళ్ల వయసు దృష్ట్యా పోలీసు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపారు. స్వఛ్చందంగా రావాలనుకుంటే స్వఛ్చందంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావచ్చు లేదా విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ పరిధిలోని అనువైన ప్రాంతం వివరాలు తెలపాలని సూచించారు. కెసిఆర్ సూచించిన ప్రాంతానికే సిట్ బృందం వెళ్లి విచారిస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్‌రావు, మాజీ ఎంపి సంతోష్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన విషయం తెలిసిందే.

సెక్షన్ 160 సిఆర్‌పిసి అంటే ఏమిటి..?

సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, మహిళలు లేదా మానసిక, శారీరక వికలాంగులను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదు. వారు ఉన్న చోటికే వెళ్లి సాక్ష్యాలను సేకరించాలని ఈ సెక్షన్ చెబుతోంది. దీన్ని అనుసరించే సిట్ అధికారులు కెసిఆర్‌కు ఈ వెసులుబాటు కల్పించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కెసిఆర్ ఎక్కడ విచారణకు హాజరవుతారు..? ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు..? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

ఇది విచారణ కాదు.. ప్రతీకారం: కెటిఆర్

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది విచారణ కాదు..ప్రతీకారం.. ఇది న్యాయం కాదు..రాజకీయ దురుద్దేశం అని విమర్శించారు.చావు నోట్లో తలబెట్టి కెసిఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు.

సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కెసిఆర్‌పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని, నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…ప్రజల తీర్పుతోనే రాస్తారని అన్నారు.

కెసిఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే: హరీష్ రావు

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యే అని, ఈ కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కెసిఆర్ తెలంగాణ జాతి పిత అని, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమని, అలాంటి నాయకుడిపై బురద చల్లాలని చూడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని వ్యాఖ్యానించారు.

పాలనలో తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ చరిత్రను సృష్టిస్తే, ఆ చరిత్రను మలినం చేసేందుకు రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కెసిఆర్ వెంటే ఉందని, ప్రభుత్వ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు.

ఎన్నికల నేపథ్యంలోనే కెసిఆర్‌కు నోటీసులు: కవిత

మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమని అన్నారు. సిట్ విచారణ సీరియస్‌గా జరగట్లేదని ఆక్షేపించారు. ఈ కేసులో విచారణ ఎక్కడో ఒక దగ్గర పూర్తికావాలని పేర్కొన్నారు. విచారణను పూర్తి చేసే ఉద్దేశం ఉందా.. లేదా అనేది ఎవరికీ అర్థం కావడంలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరస్థులకు శిక్షపడాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

భగ్గుమన్న బిఆర్‌ఎస్ నేతలు

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే కెసిఆర్‌కు సిట్ నోటీసులతో డ్రామాడాడుతున్నారపని మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి ఆరోపించారు. కెసిఆర్‌ను సిట్ నోటీసులు, కమిషన్లు ఏమీ చేయలేవని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్,క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు.

పలు చోట్ల సిఎం దిష్టిబొమ్మల దహనం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు తెలంగాణ భవన్ సమీపంలో సిఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాడెవ్వడు వీడెవ్వడు కెసిఆర్‌కు అడ్డెవ్వరు..రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్‌ఎస్‌వి నాయకులు ఆందోళనకు దిగారు. ఆర్ట్ కాలేజీ ముందు సిఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.