
మనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు నిర్ణయం చాలా మంచివని ఆయన చెప్పారు. కొంతమంది సైకోగాళ్లు మహిళలను ట్రాప్ చేసి మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అలాంటి వారికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనారే కరెక్ట్ అన్నారు.
గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎన్‌కౌంటర్ వంటి భయం కూడా ఉండాలన్నారు. వైఎస్సార్ హయాంలో వరంగంలో ఓ అమ్మాయిని వేధించినందుకు ఎన్‌కౌంటర్ చేశారన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో మరో ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ఎన్‌కౌంటర్లను రాజ్యంగ పరంగా సమర్ధించలేమని, కానీ, ఆడపిల్ల తండ్రిగా, కుటుంబాలు కలిగిన వారు సమర్ధిస్తారని, ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బాధిత మహిళలు, యువతులకు భరోసా ఇచ్చేలా పోలీసుల చర్య ఉండాలని ఆయన తెలిపారు.
ఆడపిల్లలతో ఫొటోలు తీసుకొని బ్లాక్‌మొయిల్
కొంతమంది ఆడపిల్లలతో ఫొటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అలాంటి ఫొటోలు, ఆడపిల్ల తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదును బహిర్గతం చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం బహిర్గతం చేస్తే ప్రైవసీ దెబ్బతీస్తుందని తద్వారా బాధితులు తమ జీవితం బలి తీసుకునే ప్రమాదం ఉంటుందన్నారు. ట్రాప్ అయిన అమ్మాయికి సమస్య కాకుండా పోలీసులు చూడాలన్నారు.
సున్నితమైన విషయాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంయమనం పాటించాలని నాయకులు, అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు వేయకుండా ఉండాలని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రైవసీ, ఇష్టాయిష్టాల్లో ఇంకొకరు వేలు పెట్టొద్దన్నారు. రాజకీయ నాయకుడిగా పోలీసులతో కోట్లాడుతానని, ఇది పొలిటికల్ గేమ్, పోలీస్, పాలిటిక్స్ ఎప్పుడూ ఉండేదేనని ఆయన అన్నారు. సిఐడి చారు సిన్హా ప్రకటన మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులకు వెపన్ లాంటిదన్నారు.