
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది . జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు ఇళ్లు, ఇతర ఆస్తులపై ఎసిబి అధికారులు గురువారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడు ఆదాయానికి మించి సుమారు రూ.20 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఎసిబి విభాగంలోనే హోంగార్డుగా పనిచేసేవాడని, ఆ సమయంలో ఎసిబి చేపట్టే దాడుల రహస్య సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని, అవినీతి అధికారులకు చేరవేసేవారని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలున్నాయి.
ఈ కారణంతోనే గతంలో అతడిని ఎసిబి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ, పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, గుర్ల మండలంలోని శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు విలాసవంతమైన భవనాలు, భూముల పత్రాలతో పాటు నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో ఎసిబి అధికారుల విచారణ సాగుతోంది.