Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్‌ను తప్పించ బోయి డీజిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్ ఎస్‌కె. కలాం సజీవ దహనం అయ్యాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌కు చెందినవాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఘటనపై అన్నవరం సబ్ -ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.శ్రీధర్ మాట్లా డుతూ సర్వీస్ రోడ్డు నుండి అకస్మాత్తుగా హైవేపైకి వచ్చిన రొయ్యలతో నిండిన వ్యాన్‌ను తప్పించుకునేందుకు కలాం ప్రయత్నించినప్పుడు, కలాం నడుపుతున్న లారీ డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. కలాం మృతదేహం లారీ లోపల కాలిపోయి కనిపించిందన్నారు. దీనిపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.