Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది విచారణ కాదు..ప్రతీకారం.. ఇది న్యాయం కాదు..రాజకీయ దురుద్దేశం అని విమర్శించారు.చావు నోట్లో తలబెట్టి కెసిఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు.

సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కెసిఆర్‌పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని, నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…ప్రజల తీర్పుతోనే రాస్తారని అన్నారు.