Reading Time: < 1 minute

ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయనీయం

గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలి

టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. కెసిఆర్ సిట్ విచారణకు సహకరించాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు. గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా అధికారులు ట్యాపింగ్ చేయలేరని ఆయన ఆరోపించారు. ఉద్యమకారుడిగా కెసిఆర్‌పై గౌరవం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలని మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

500లకు పైగా ఫోన్ నంబర్‌లు ట్యాప్ అయ్యాయన్న సమాచారం తమ దగ్గర ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు నందినగర్‌లోని కెసిఆర్ ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో కెసిఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారని, దీంతో నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. సిట్ సంపూర్ణ విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని, ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కెసిఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దురుద్దేశం లేదన్నారు. మున్సిపా లిటీలో మెజారిటీ స్థానాలను గెలుస్తామన్నారు. మున్సిపాలిటీల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. ఇంచార్జ్ మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు బిఫాం ఇచ్చే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.