
మనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. తన పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో చర్చకు దారితీసింది. భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానంతో క్యాంపస్‌ను సిఎం రేవంత్ సందర్శించారు.
ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను సిఎం రేవంత్‌రెడ్డి పంచుకున్నారు. విద్యార్థులతో జరిగిన చర్చాగోష్ఠిలో సిఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను విద్యార్థులకు వివరించారు. విజయం అనేది అదృష్టం వల్ల రాదని నిరంతర కృషి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఎవరికైనా వారి కెరీయర్‌లో ప్రారంభంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా అధిగమించాలో విద్యార్థులకు సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా అన్నిరంగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి సిఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నామో ఆయన చెప్పారు. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహారించాలని సిఎం వారికి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని సిఎం అన్నారు.