
ఇదో సమర్థుడైన, విజయవంతమైన ఐఏఎస్ అధికారి అనుభవాల సంకలనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాక, ఎన్నో కీలకమైన ప్రభుత్వరంగ పరిశ్రమలను తన సామర్థ్యంతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన అధికారి ఎం. గోపాల కృష్ణ గారు. నిజమైన కర్మయోగి విశిష్టమైన ఐఏఎస్ కెరీర్, అధికార స్వామ్యానికి అతీతమైన జీవితాన్ని వివరంగా వివరిస్తుంది. సంఘంలో పలుకుబడి, హోదా, అధికారం, ఇంటా బయటా సమాజంలో గౌరవం, రాజకీయ వర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే ఐఏఎస్ అంటే అందరికీ మోజు. యువతరంలో కాస్త ప్రతిభా పాటవాలు గలవారిలో మెజారిటీ ఐఏఎస్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతారు. సినీ ప్రముఖుల తర్వాత ఐఏఎస్‌లు అంటేనే మోజు. ఇదో పవిత్రమైన వృత్తి. అధికార వర్గాలతో మమేక మవుతూ, తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపే అలాంటి వారు తన అనుభవాలను, జ్ఞాపకాలను, వాస్తవాలను పంచుకుంటూ చెప్పే కథలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఐఏఎస్ జీవితం అంటే నల్లేరుమీద నడక కాదు.
ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, కీలకమైన అంశాలలో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఒక్కోసారి నో గో జోన్స్- అంటే అత్యంత ప్రమాదకరమైన, భద్రతా కారణాల వల్ల నిషేధిత ప్రాంతాలలో దూసుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడు ఎదురైన సంఘటనలు, అనుభవాలు, వెల్లడించేందుకు ఆసక్తి చూపుతారా అన్నది ప్రశ్న. అలాగే ఆ పరిస్థితుల్లో పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుతారా, మొహమాటం లేకుండా వెల్లడిస్తారా అన్నది మరో ప్రశ్న. ఆయా రచయితలు వ్యక్తిగత అభిప్రాయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, ఓ నిర్ణయం తీసుకునే ముందు ఎంత కసరత్తు జరుగుతుందన్న విషయాలను ఈ పుస్తకాలు వెల్లడిస్తాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ గారి లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి -అనే పుస్తకం భారీ సంకలనం. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ కెరీర్ బ్యూరోక్రాట్ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్ల కీలక బాధ్యతలు నిర్వహించి ఎంతో అనుభవం సాధించారు. ఈశాన్య రాష్ట్రాలలోనూ గణనీయమైన పరిపాలనా అనుభవం ఉంది.
ఆయన ప్రజ్ఞా పాటవాలకు ఒక ఉదాహరణ. గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ షెడ్యూల్ కన్నా ముందుగానే, అంచనా వ్యయం బడ్జెట్‌లోనే ప్రారంభించేటట్లు సిద్ధం చేసి కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఇది ప్రాజెక్టు నిర్వహణలో కేస్ స్టడీగా నిలవడం విశేషం. ఆయన ప్రతిభ, సామర్థ్యం ఆయనకు 400పైగా అవార్డులు గెలుచుకునేటట్లు చేసింది. కార్యనిర్వహకుడిగా, ట్రబుల్ షూటర్‌గా ఆయన నైపుణ్యం అపారం. గోపాలకృష్ణ గారు.. ఒక సందర్భంలో ఇలా అన్నారు. తనకన్నా ముందు సివిల్ సర్వెంట్స్ విద్యాపరంగా, సాంకేతిక పరంగా, అనుభవపూర్వకంగా చాలా అర్హత కలిగినవారు, బహుముఖ ప్రజ్ఞకలవారు. అభివృద్ధి ప్రణాళికలను విశ్లేషించడానికి, ప్రయోజనకరమైన సలహాలు ఇచ్చి నడిపించడానికి తగినవారు అని తాను గమనించానని, అలాంటి వారి చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంది అని పేర్కొన్నారు. పుస్తకంలోని మొదటి భాగంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. రచయిత దేశం వివిధ ప్రాంతాలలో తాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన బహుళ అనుభవాలను ఈ అధ్యాయాలలో వివరించారు.
ఆయన ప్రభుత్వరంగ ప్రతినిధిగా స్టాండిగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్‌సిఒపిఇ) చైర్మన్‌గా కూడా పనిచేశారు. పుస్తకంలో రెండో భాగం పదవీ విరమణ తర్వాత ఆయన అనుభవాలు, అనుభూతులను వివరిస్తుంది. దీనిని ఆయన సేవా విత్ భావ అన్నారు. ఇది ఆయన ఇఎంఆర్‌ఐ, ఎన్‌హెచ్‌ఆర్‌డి, ఎన్‌బిఎ, ఎప్‌ఐసిసిఐ, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ సంస్థలను నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాల సేకరణ. అటువంటి అద్భుతమై కెరీర్‌లో ఎదురైన అనుభవాలు ఎందరికో స్ఫూర్తి దాయకం. అప్పటి గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ నుంచి, ఆయనతో కలిసి పనిచేసిన తోటి బ్యురోక్రాట్ల అభిప్రాయాలు, అనుభవాలు సంక్షిప్తంగా 10 పేజీలలో కన్పిస్తాయి. ఆయన అసాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలపై తోటి వారి అభిప్రాయానికి ఆ పేజీలు అద్దం పడతాయి. డాక్టర్ రంగరాజన్.. తన స్పందనలో గోపాల కృష్ణ కథనం వివరాలతో నిండి ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎదురైన ఘటనలను వివరణాత్మకంగా గుర్తు ఉంచుకుని రాశారు. ఆయనకు అసాధారణ జ్ఞాపకశక్తి ఉండాలి, కథనంలో ఆసక్తికరమైన అంశం ఎనిమిది దశాబ్దాల సామాజిక, కుటుంబ జీవితం గురించి వివరించడం. ఉమ్మడి కుటుంబాల పనితీరు, ఆనాటి అనుభవాలను చక్కగా వివరించారు. సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి నిజమైన పాలన అంటే ఏమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. ఎంతో సమాచారాన్ని అందిస్తుంది.
– మల్యాల