
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు లారీలు కాలిపోవడంతో ఒకరు సజీవదహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్‌తో వెళ్తున్న లారీని వెనుకనుంచి కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు లారీల క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనమయ్యారు. లారీల డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.